లేదాస్కారము దేవతావితతి రాలేదంట కీ గోడపై
నేదో పూర్వ యుగాల సoసృతి భయం బీ దైత్యు లోగుండెలో
బాదుల్ కట్టుక కూరుచున్న యది యీ ప్రాకార రూపంబునన్.
రావణుడి లంకానగరం చాలా సుందరమైనది. ఆ నగరం చుట్టూ ఎత్తైన ప్రాకారం నిర్మించాడు రావణుడు. బ్రహ్మదత్త వరాలున్న వాడికి యదార్థంగా ఎవరివల్లా భయం ఉండకూడదు. మరి భయం లేనివాడు, నగరం చుట్టూ అంత ఎత్తైన గోడ కట్టవలసిన అవసర మేమొచ్చింది? సముద్రంలో ఉండే జలచరాలు వచ్చి నగరం మీద పడతాయని ఈ గోడ కట్టాడా? రెండవది, రాక్షసులకు శత్రువులు దేవతలు. దేవతలు ఇక్కడ ప్రవేశించకుండా ఈ గోడ కట్టాడా? దానికి ఆస్కారం లేదు. దేవతలు కామరూపులు. ఏ విధంగా నైనా రాగలరు. అందువల్ల, రావణుడిని, పూర్వ యుగాల నుండి మోసుకు వచ్చిన, ఏదో తెలిసీతెలియని భయం గుండెలోతుల్లో పీటవేసుకొని, ఈ ప్రాకారం రూపంలో వెంటాడుతున్నది.
ఇదీ శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండములో కథాపరంగా మొదటి పద్యం.
జయవిజయులు శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు. సనకసనందనాది మునుల శాపంతో రాక్షసులుగా పుట్టి, మూడు జన్మల తరువాత శాపవిముక్తి పొందుతారు. కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరంలో శిశుపాల దంతవక్త్రులుగాను జన్మించి, శ్రీమహావిష్ణువుచే వధింపబడి, శాపవిముక్తులౌతారని పఠితలకు తెలుసు. " ఏదో పూర్వ యుగాల సంసృతి భయం " అనడంలో ఈ మూడు జన్మల పరంపరను, అందునా కథకు సంబంధించిన రావణుని గుండె లోపలి పొరల్లో దాగియున్న భయాన్ని పఠితల స్మృతిపథంలోకి తేవడం, ఈ సంశయ ఖండ నిర్మాణానికి చాలా అవసరం. రావణుడి గుండె లోపొరల్లో రాముడే శ్రీ మహావిష్ణువా అన్న సంశయానికి బీజావాపన ఈ ఖండంలో జరుగుతుంది. తరువాత కొంతకాలంపాటు ఆ సంశయం నివృత్తి అవుతుంది. అది నిస్సంశయ ఖండంలో స్పష్టంగా కనపడుతుంది. కానీ, ఆ సంశయ నివృత్తి నిలకడగా ఉండదు. ఈ సంశయ నిస్సంశయాల మధ్య రావణుని మనస్సులో చెలరేగబోయే ఘర్షణకు, ఈ పద్యంతో అంకురార్పణ జరిగింది. అదే ఈ పద్యం విశిష్టత. అదే విశ్వనాథవారి శిల్పనిర్మాణ కౌశలం.
No comments:
Post a Comment