వచియింతు వేములవాడ భీమనభంగి
నుద్దండలీల నొక్కొక్కమాటు
భాషింతు నన్నయభట్టు మార్గంబున
నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు
వాక్రుత్తు తిక్కయజ్వప్రకారము రసా
భ్యుచితబంధముగ నొక్కొక్కమాటు
పరిఢవింతు ప్రబంధపరమేశ్వరుని ఠేవ
సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు
నైషధాది మహాప్రబంధములు పెక్కు
చెప్పినాడవు మాకు నాశ్రితుడ వనఘ!
యిపుడు చెప్పదొడంగిన యీ ప్రబంధ
మంకితము సేయు వీరభద్రయ్య పేర.
శ్రీనాథ కవిసార్వభౌముడు యీ పద్యంలో తనకు పూర్వులైన నలుగురు మహాకవులను స్మరించుకున్నాడు.
వేములవాడ భీమకవి 11వ, లేక 12-13వ శతాబ్దముల మధ్య కాలానికి చెందినవాడని చరిత్రకారులు చెబుతున్నారు. భీమకవి పేర చాలా చాటు పద్యాలున్నాయి. రాఘవపాండవీయము, నృసిం హపురాణము, అతడు వ్రాసాడని చెబుతున్నా, అవి ఇప్పుడు అలభ్యాలు.
కవిత్రయము గురించి తెలుగువారికి ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు.
అయితే, శ్రీనాథుడు చెప్పిన ప్రకారము వేములవాడ భీమకవిది గంభీరమైన శైలి అనీ, నన్నయ సంస్కృతాంధ్రముల మేళవింపుతో ప్రౌఢ కవిత్వం చెప్పగలవాడని, తిక్కనసోమయాజి రసౌచిత్య కవిత్వానికి మారుపేరని, ఎఱ్ఱన సూక్తివైచిత్రికి ప్రసిద్ధి వహించాడని తెలుస్తున్నది. పూర్వకవులను స్మరిస్తూ, వారి కవితారీతులను అనుసరిస్తామని చెప్పడము కవుల సంప్రదాయాన్ని, సంస్కారాన్ని, తెలియజేస్తుంది. ప్రౌఢకావ్యమైన శృంగారనైషధకర్తయైన కవిసార్వభౌముడు ఇప్పుడు కాశీఖండము అనే మహాప్రబంధము వ్రాస్తున్నాడు కనుక, దానిని వీరభద్రభూపాలుని పేర వెలయించమని కృతిభర్త అర్థిస్తున్నటుగా యీ పద్యము తెలియజేస్తుంది.
శ్రీనాథ కవిసార్వభౌమ విరచిత కాశీఖండము కావ్యావతారిక నందలిది యీ పద్యము.
No comments:
Post a Comment