రారా వణిగ్వంశ వారాశిహిమధామ!
రారా వికస్వరాంభోరుహాక్ష!
రారా మహాఘోర వీరశైవాచార!
రారా ఘనౌదార్య రాజరాజి!
రారా కుమార కంఠీరవేంద్ర కిశోర!
రారా సమగ్ర ధీరౌహిణేయ!
రారా మనోభవాకార రూపవిలాస!
రారా అసార సంసార దూర!
రారా నా వన్నెవడుగ! రారా తనూజ!
రార సిరియాల! రార నా ప్రాణ ప్రదమ!
రార నా కుఱ్ఱ! రార నా జియ్య! రార యనుచు
జీరు గారాపు గొడుకు రాజీవ నయన.
అత్తన్వంగి సమస్త దిక్కులను పర్యాయ క్రమం బొప్పగా
నొత్తె జిన్నికుమార రార యని అత్యుచ్ఛైశ్శృతిం జీరినన్
జిత్తంబుబ్బగ వచ్చె బాలుడు మహా శీఘ్ర ప్రచారంబునన్
దత్తద్వ్యంజన పాకగంధ్యవయవ స్థాన ప్రతానంబుతోన్.
ఈ రెండు పద్యములు శ్రీనాథ కవిసార్వభౌముని హరవిలాసము కావ్యములోని చిరుతొండనంబి వృత్తాంతము నందలివి.
చిరుతొండనంబి వీరశైవమునకు చెందిన మహాశివభక్తుడు. ఆయన భార్య తిరువెంగనాంచి. చిరుతొడనంబికి ప్రతిరోజు ఒక అతిథికి భోజనము పెట్టకుండ భోజనము చేయరాదను నియమము కలదు. అతని వ్రతదీక్షను పరీక్షింప దలచి, శివుడు కపటయోగి వేషంలో, చిరుతొండనంబి అభ్యర్థన మీద అతని ఇంటికి వచ్చాడు. అయితే ఒక షరతు పెట్టాడు. అతడు ఏడాదిగా నిరాహారుడుగా వ్రతం చేస్తున్నాడని, వ్రతంలో భాగంగా, ఆతిథ్యమిస్తున్న గృహస్థు, పిన్నవయస్కుడైన అతని కొడుకు మాంసమును వండి వడ్డించగా, గృహస్థు, అతని కొడుకు సహపంక్తిలో కూర్చుండగా, ఆ వ్రతాన్ని పూర్తిచేస్తానన్నాడు. అందుకు అంగీకరించి, కొడుకు సిరియాలుని మాంసాన్ని వండి, అరటి ఆకులో వడ్డించిన, తిరువెంగనాంచిని చూసి, తన ప్రక్కన కూర్చొని భోజనం చేయడానికి, కొడుకును పిలువమని అడిగాడు కపటయోగి. బాలుడు ఎక్కడో ఆడుకుంటున్నాడని, అందువలన ఆతిథ్యము స్వీకరించమని చెప్పిన, తిరువెంగనాంచిని ఉద్దేశించి చెప్పినవి యీ పద్యాలు.
ఇక ఇక్కడ నుండి, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు " కావ్య పరీమళము " అనే వ్యాఖ్యాన గ్రంథములో వివరించిన అమూల్యమైన విశేషాంశాలను వారి మాటల్లోనే, పొందుపరుస్తున్నాను. మహాకవుల అద్భుతమైన వ్యాఖ్యానానికి నా స్వంత పైత్యము అనవసరము.
" ఈ కథలో నున్న పట్టంతయు నీ రెండు పద్యములలో నున్నది. చచ్చినవాడు, కూరలుగా వండబడిన మాంసము కలవాడు, బ్రతికి వచ్చుట యెట్లు? ఇది యసంభవము కదా!
అగస్త్య మహర్షి వాతాపియను రాక్షసుని చంపెను. ఇల్వలుడు వానిని గొఱ్ఱెను చేసి యా మాంసము నగస్త్యునకు వండిపెట్టెను. అగస్త్యుడు తిన్నంతసేపు " వాతాపి జీర్ణం-వాతాపి జీర్ణం " అనుచు తినెను. తరువాత నిల్వలుడు వాతాపిని పిలువగా వాడు రాలేదు. జీర్ణమై పోయెను. అనగా, జీర్ణమైనచో మరల బ్రదుకుట సంభావము కాదుగాని, జీర్ణముకానిచో బ్రతుక వచ్చునన్నమాట!
బ్రతుకుట యనగా నేమి? ఈ శరీరావయవములు సంతన పడగా ప్రాణములు వచ్చి యందులో చేరుట.
సంతన పడుట యెట్లు? ఎంత ప్రకృతిశాస్త్ర మహావిజ్ఞానమైనను మనుష్యులను సృష్టించుట లేదుగదా!
దైవము యొక్క విలాసము చేత సృష్టి కలుగుచున్నది. పెరుగుచున్నది. కొంతకాలము పట్టుచున్నది. కాలము కూడ భగవంతుడే. వాడు తలచినచో కాలము కూడ నక్కఱ లేదు.
అసలీశరీరము నిర్మింపబడవలసిన అవసరమేమి? జీవుడు తన కర్మ ఫలము ననుభవించుటకు. ఈ శరీరముండుటతోడనే దీనిలోనికి ప్రాణములు వచ్చి చేరుచున్నవి. అవి యెచ్చటనుంచి వచ్చుచున్నవి?
నానా దిక్కులనుండి వచ్చుచున్నవి. అనగా సర్వదిశలును ప్రాణభరితములని యర్థము. పంచభూతములయందు ప్రాణములున్నవని యర్థము. జీవుడుగా కావలసిన ప్రాణముల లక్షణములు వేఱు. అది భగవంతునికే తెలియును.
ఇవి యతీంద్రియ విషయములు. అతీంద్రియ విషయములు వేదములే చెప్పగలవు.
సామాన్యులు మరణింతురు. యోగులు సిద్ధులు మరణింతురు. వారికి పునర్జన్మ లేదు. కర్మబద్ధులైన జీవులకు ప్రాణసంపుటి చెడదు. సిద్ధులకు యోగులకు ప్రాణసంపుటి చెడిపోవును.
ఈ మహా విషయము ఇంధ బ్రాహ్మణములో కలదు. అది బృహదారణ్యకములోని చతుర్థాధ్యాయములోని ద్వితీయ బ్రాహ్మణము. అచ్చట నిట్లున్నది.
తస్య ప్రాచీదిక్ ప్రాంచః ప్రాణాః
దక్షిణాదిక్ దక్షిణే ప్రాణాః
ప్రతీచీదిక్ ప్రత్యంచః ప్రాణాః
మొదలుగా ఏ దిక్కు ప్రాణములాదిక్కునకు పోవును. అప్పుడు బ్రహ్మ పదార్థము మిగులును.
ఈ మహారహస్యమును శ్రీనాథుడీ కథ చివరగా ననుసంధించెను.
ఆ సిరియాలుడు బ్రతికెను. ఆ బ్రతుకుట యెట్లో శ్రీనాథుడు వేదముయొక్క సాక్ష్యమును చూపించెను.
రెండవ పద్యములో నాల్గవ చరణములోని యర్థము, కవితాగుణముతో కూడియున్నది. అనగా కల్పనా చమత్కార సహితముగా నున్నది.
అనగా నా పిల్లవాని యవయవములు పెట్టిన పోపులవాసనలు వేయుచున్నవట.
అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యెను. వరములిచ్చెను. "
No comments:
Post a Comment