గ్రహకృత కార్యబుద్ధి విశిఖాస శిఖాకృతి ధర్మశాస్త్ర మే
నృహరికి మౌర్విరావ బధిరీకృత గాఢనభోంతరాళ ది
క్కుహరునకున్ సలక్ష్మణునకున్ రఘురామునకున్ నమస్కృతుల్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనిది ఈ పద్యం. సీతాన్వేషణకు బయలుదేరే ముందు, హనుమంతుడు ఇష్టదేవతా ప్రార్థన చేశాడు. ఈ పద్యం లక్ష్మణ సహితుడైన రఘురాముని స్తుతించిన పద్యం.
ఈ పద్యంలో, విశ్వనాథవారు రాముని ప్రస్తుతిస్తూ పలు విశేషణాలను వాడారు. ఆయన సలక్ష్మణుడు. లక్ష్మణుడు ఉపాసనా స్వరూపుడు. రామోపాసనా దురంధరుడు. అంతేకాక రఘురాముడు. రఘువంశానికి చెందినవాడు. రఘు మహారాజు దేశకాలాతీతుడు. కామమును జయించినవాడు. పరమ విరాగి. ఆయన భార్యను ఎవరో ప్రేమించానని అర్థిస్తే, భార్యను అతనికి ఇచ్చివేశాడు. అట్టి వంశములో పుట్టినందున రఘురాముడైనాడు. ఇక రాముని బాణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దాని పేరు రామబాణం. ఆ ప్రత్యేకత రాముని వల్లనే వచ్చింది. రాముడు చండశాసనుడు. దైత్యులను సంహరించే వాడు. ఆయన స్వరూపం, అవతార రహస్యం అట్లాంటివి. ఈ రామబాణం కోదండం నుండి వినిర్గమిస్తుంది. అసలు ఆయన వింటినారి శబ్దమే హృదయభేద్యం. అది ముల్లోకాలను, భూమ్యాకాశలను, అన్ని దిక్కులను దద్దరిల్ల జేస్తుంది. ఇక రామబాణం శక్తి గురించి వేరే చెప్పాలా? అది అంతటా విహరిస్తూ, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తూ ఉంటుంది. రామబాణ ప్రయోగం చేసి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసే రాముడు కార్యబుద్ధి. అంటే చేసే పని యందు వ్యగ్రత కలవాడు.
హనుమంతుడు, అటువంటి సలక్ష్మణునకు, రఘురామునికి నమస్కరించి తాను చేయవలసిన పనిని ప్రారంభిస్తున్నాడు. లక్ష్మణుడెంతటి రామోపాసకుడో, ఆంజనేయుడూ అంతే.
No comments:
Post a Comment