పక వినతాతనూజుడు శుభంబులు లిప్తలు వెల్లువై చక
చ్చకితముగా దివానిశల జాచిన ఱెక్కలువోలె నున్న మీ
రకుటిలమూర్తు లెవ్వరు హృదంతరవర్తిప్రదీపికాకృతుల్.
కదిలేవానితోను, కదలనివానితోను నిండియుండి జగత్తుగా కనిపిస్తూ, లిప్తలు లిప్తలుగా విభజింపబడి, ప్రవాహరూపంలో ఉన్న ఈ కాలస్వరూపమే వినత కుమారుడైన గరుత్మంతుడు. ఇరువైపుల చాచిన అతని ఱెక్కలే పగలు, రాత్రి. కాలస్వరూపునిలో అంతర్యామిగా వెలుగుతున్న ప్రజ్ఞయే శ్రీమహావిష్ణువు. ప్రాణికోటి యొక్క ఉచ్ఛ్వాసనిశ్వాసములే గరుత్మంతుని సుపర్ణములు, మంచి రెక్కలు, అని సుపర్ణసూక్తం చెబుతుంది. ఆ ఉచ్ఛ్వాసనిశ్వాసములను నియంత్రిచే ప్రాణశక్తి అంతర్యామి ప్రజ్ఞగా నున్న శ్రీమహావిష్ణువు. అందుకనే, శ్రీమహావిష్ణువు గరుడారూఢుడై విహరిస్తుంటాడని ప్రతీకాత్మకంగా చూపడం. అవతారమూర్తులైన రామలక్ష్మణులు హృదంతరవర్తిప్రదీపికాకృతులు. అనగా, ఈ సృష్టిలోని చరాచరప్రకృతి యందు జ్యోతిరూపమై ప్రకాశించే అంతర్యామి తత్త్వం. గరుడారూఢుడైన ఆ తత్త్వాన్ని దర్శించాడు హనుమంతుడు. దానికి అక్షర రూపమే, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధాకాండము, నూపుర ఖండములోని ఈ పద్యం.
శ్రీమద్రామాయణ కల్పవృక్షములో, హనుమంతుడు చాలాచోట్ల తనకు తాను వినతాతనూజుడు, గరుత్మంతునితో పోల్చుకొన్నట్లు విశ్వనాథవారు వర్ణించారు. ఈ సందర్భంలో, పంచముఖాంజనేయ స్వరూపంలో గరుత్మంతుని స్వరూప మొకటి అనేది ఇక్కడ గమనార్హం.
No comments:
Post a Comment