దమ్ములు ధర్మరాజునకు దమ్ములు చెప్పినయట్లు సేయ నా
తమ్ముడు నట్టి రందు జినతమ్ముడు సన్మతి రామమూర్తి చి
త్తమ్మున నేను వాని కొక దైవముగా గనిపింతు నెంతయున్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారిక లోని యీ పద్యం ద్వారా, భారతీయులకు పారాయణ గ్రంథాలైన రామాయణ, భారతాలు ఏదైతే ధర్మాన్ని ఆచరణపూర్వకంగా నిరూపించాయో, దానిని ప్రాతిపదికగా తీసుకొని, తమ స్వీయానుభవాన్ని వివరిస్తున్నారు విశ్వనాథవారు.
ఆదికవి వాల్మీకి రచించిన రామాయణ కావ్యం, మానవజాతికి పలు ధర్మాలను బోధించింది. అందులో భాతృధర్మం ఒకటి. రాముని తమ్ములు ఆయన ఊహకు తగ్గట్లుగా నడచుకొనేవారు. అదే ధర్మాన్ని, వ్యాస విరచిత మహాభారతేతిహాసం ఇంకొక రీతిగా బోధించింది. ఈ కావ్య కథానాయకుడు ధర్మరాజు. ధర్మరాజు తమ్ములు, ఆయన ఏది చెపితే అది తప్పకుండా చేసేవారు.
ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణగారు తన తమ్ములను గురించి చెబుతున్నారు. వారి తమ్ములు, పైన చెప్పిన రెండు లక్షణాలు కలబోసుకొన్న వారని ఈ పద్యం తెలుపుతుంది. అంటే, విశ్వనాథవారి ఊహలను తెలుసుకొని, ఆయన చెప్పినట్లు మెలిగేవారని భావం. అందులో, ముఖ్యంగా, వారి చిన్న తమ్ముడు రామమూర్తి చాలా మంచివాడని, అతనికి , విశ్వనాథవారు సాక్షాత్తు దైవసమానమని చెబుతున్నారు.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్య, యుద్ధ కాండములలో, శ్రీరాముడు స్వయంగా తనకు సోదరుల కంటె ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేశాడు. భారతీయ జీవన విధానంలో యీ బంధం చాలా ముఖ్యమైనది.
No comments:
Post a Comment