నను విను కీచకాంతక ! మనంబున ద్రోణుడు మెచ్చ జొచ్చి య
మ్మొన గలగింప కిట్లు కురుముఖ్యుడు ధర్మసుతుండు గారవిం
చిన జతనంబు నిష్ఫలము సేయుదునే? నరుడున్ సుభద్రయున్
దనయుని గాంచి సంతసము దాల్చుట యంతయు రిత్తబుత్తునే?
ధర్మరాజు అభిమన్యుడిని పద్మవ్యూహం ఛేదించుకొని లోపలి వెళ్ళమన్నాడు. దానికి పొంగిపోయిన అభిమన్యుడు, తనకు పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తెలుసునని, బయటపడటం తెలియదని చెప్పాడు. అయినా ఏ మాత్రం భయపడవలసిన పని లేదని వీరోచితంగా పలికాడు. సమాధానంగా భీముడు, అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చేదించుకొని లోపలికి వెళ్ళగానే, వెనుక తామంతా అతనికి సహాయంగా వచ్చి శత్రువులను చీల్చిచెండాడుతామని చెప్పాడు. ప్రతిగా అభిమన్యుడు చెప్పిన మాటలే ఈ పద్యం తాత్పర్యం.
" కీచకుడిని మట్టుబెట్టిన నా పెదనాన్నా ! నేను చెప్పేది శ్రద్ధగా విను. కురుకులాలంకారము, ధర్మమూర్తి అయిన పెదనాన్న ధర్మరాజు నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ద్రోణాచార్యుడు సహితం మెచ్చుకొనేటట్లుగా, పద్మవ్యూహాన్ని ఛేదిస్తాను. నా తలిదండ్రులు సుభద్రార్జునులను సంతోష పెడతాను. "
శ్రీమదాంధ్ర మహాభారతము, ద్రోణపర్వం, ద్వితీయాశ్వాసంలోని ఈ పద్యంలో నాలుగు విశేషాలున్నాయి.
మొదటిది, ' కీచకాంతక ! ' అని పెదనాన్న భీముడిని సంబోధించటంలో, అతడు కీచకుణ్ణి ఏ విధంగా మెదిపి ముద్దగా చేశాడో, అదే విధంగా తాను కూడా శత్రువుల పీచ మణుస్తానన్న గట్టి సూచన. రెండవది, అర్జునుడు ద్రోణుని ప్రియశిష్యుడు. అందువల్ల, ' ద్రోణుడు మెచ్చ జొచ్చి ' అనటంలో ' తండ్రిని మించిన తనయుడు ' అని అనిపించుకోవాలనే ఉత్సుకత అభిమన్యుడిలో వ్యక్తమౌతున్నది. మూడవది, ధర్మరాజంతటివాడు అడిగాడు. అది చెప్పలేని గౌరవాన్ని తెచ్చిపెట్టింది అభిమన్యునికి. దాన్ని నిరర్ధకం చెయ్యకూడదు అనే పట్టుదల కనపడుతున్నది. చివరగా, అన్నిటికంటె ముఖ్యంగా, తలిదండ్రులను సంతోషపెట్టటం. సంతానం వృద్ధిలోకి వస్తే సంతోషించేవాళ్ళలో ప్రథములు తల్లిదండ్రులు.
ఈ విధంగా తిక్కనగారి ప్రతిభాజన్యమైన ప్రకాశం, ఈ నాలుగు అంశాలతో నాలుగు దిక్కులా ప్రసరించింది.
No comments:
Post a Comment