బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము? గావునన్ మహీ
వల్లభ! తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలో
ద్రెళ్ళగ సర్పయాగ మతిధీయుత! చేయుము విప్రసమ్మతిన్.
ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం.
తక్షకుడు ఉదంకుడికి అపకారం చేశాడు. అపకారం చేస్తే సరిపెట్టుకొని ఊరుకొనే రకం కాదు ఉదంకుడు. తక్షకుడు ఏ విధంగా ఉదంకుడికి అపకారం చేశాడో, అదేవిధంగా జనమేజయునికి కూడా అపకారం చేశాడు. జనమేజయుని తండ్రి పరీక్షిన్మహారాజుని విషాగ్నికి గురిచేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకొనమని, జనమేజయుడిని ప్రేరేపించడం ఈ పద్యం యొక్క విశేషం. ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వము, ప్రథమాశ్వాసంలో ఉన్నది.
" బుద్ధిమంతుడవైన ఓ జనమేజయ మహారాజా! దుష్టుడైన ఒక్కడి దుశ్చర్యల వల్ల, మొత్తం కులమంతా నాశనమవటం ఏమీ క్రొత్త కాదు. అందువల్ల, తక్షకుడు చేసిన అపకారానికి ప్రతీకారంగా, బ్రాహ్మణుల అనుమతితో, సర్పకులం అంతా అగ్నిలో పడేటట్లుగా, సర్పయాగం చేయవలసినది. "
ఈ పద్యంలోని " అపూర్వము " అన్న పదాన్ని ' ఇంతకు మున్నెన్నడు ఎరుగనిది కాదు ' అనే అర్థంలో వాడారు. ఇంతకు ముందు, కురుక్షేత్ర మహాసంగ్రామానికి , కౌరవ వంశక్షయానికి, దారి తీసింది దుర్యోధనుని దుష్టవర్తనమే అన్న వస్తుధ్వని ఇందులో ఇమిడి ఉన్నది. ఇంకొక రకంగా, చెడు ప్రవర్తన, నాశనానికే దారి తీస్తుందని, ఇదేమీ అచ్చెరువు కొలిపేది కాదు అని అర్థం చేసుకొన్నా ఇబ్బందేమీ ఉండదు.
No comments:
Post a Comment