పరమసుఖంబులంది నరపాలుడు ధర్మగృహీతకామినీ
పరమసుఖంబు లంది నరపాలుడు శత్రు నిబర్హణక్రియా
పరమసుఖంబు లంది నరపాలుడు తృప్తిని గాంచడింతయున్.
దశరథుడు రాజ్యపాలన ఏ విధంగా చేసాడో యీ పద్యం సుస్పష్టంగా తెలియజేస్తున్నది.
దశరథుడు అరవై వేల సంవత్సరాలు, అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసికొని కోసలరాజ్యాన్ని పాలించాడు. దశరథుని రాజ్యపాలన మూడు రకాలయిన ప్రాతిపదికల మీద జరిగింది. అందులో మొదటిది, అతి ముఖ్యమైనది ధర్మ మార్గం తప్పకుండా పాలన చేయడం. రెండవది, తన తదనంతరం రాజ్యంలో సుస్థిరపాలన నెలకొనడానికి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించి, సత్సంతానాన్ని పొంది, రాజ్యపరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగించడం. మూడవది, క్షత్రియులకు ఉచితమైన శత్రువులను నిరోధించడము, ఆ విధంగా ప్రజలను కాపాడడం. ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యపాలన చేయడం వల్ల, దశరథుడు ఇహలోకంలో చెప్పలేని సుఖాన్ని, పరలోక సుఖాన్ని పొందడానికి పునాదిని వేసుకొన్నాడు. ఇన్ని చేసినా, రాజుకి తృప్తి మాత్రం కలుగలేదు. దానికి కారణం, అతనికి పుత్రసంతానం కలుగకపోవడమే నన్నది యీ పద్యంలో ధ్వనిస్తున్నది.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము బాలకాండము ఇష్టిఖండంలో ఉంది.
No comments:
Post a Comment