యగువాడు పతితుడౌ; నర్థసేవ
నర్థార్థముగ జేయు నత డుగ్రవనములో
గోరక్ష సేయు నక్కుమతి బోలు
నర్థ ధర్మములకు హానిగా గామార్థి
యగు నాత డల్పజలాశయమున
జలచరం బెట్టు లజ్జలములతో జెడు
నట్లు కామంబుతో హానిబొందు;
నర్థ ధర్మములు మహాబ్ధి మేఘము లట్టు
లుభయమును బరస్పరోదయమ్ము
లిట్లుగా ద్రివర్గ మెఱిగి సామ్యమున సే
వించువాదు సర్వ విత్తముండు.
లోకంలో మనం భీముణ్ణి బలానికి, శౌర్యానికి, వీర్యానికి ప్రతీకగా చూస్తాము. మహాభారతంలో భీముని లోని వివిధ కోణాలు ఆవిష్కరింపబడతాయి.
నన్నయ భారతం అరణ్యపర్వం ప్రథమాశ్వాసంలోని యీ పద్యం, భీముని సూక్ష్మ పరిశీలనాదృష్టిని, ధర్మాధర్మ వివేచనలో తార్కికబుద్ధిని తెలియజేస్తుంది.
వనవాసంలో కష్టాలనుభవిస్తున్న భీమార్జున నకుల సహదేవులు, ద్రౌపది, ధర్మరాజు ధర్మబుద్ధికి, అతి మంచితనానికి ఒకింత నిర్వేదానికి గురౌతారు. భీముడు ధర్మార్థకామమోక్షాలనే నాలుగు పురుషార్థాలలో, త్రివర్గాన్ని గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడు.
త్రివర్గము అంటే ధర్మము, అర్థము, కామము. ధర్మం, కామం, తగ్గిపోయేటట్లు, అర్థాన్ని సేవించేవాడు పతనమౌతాడు. కేవలం అర్థసముపార్జనే లక్ష్యంగా అర్థాన్ని సేవించేవాడు, భయంకరమైన అడవిలో మృగాలబారినుండి గోవులను రక్షించే ప్రయత్నం చేసే బుద్ధిహీనుడిలాంటివాడు. ఇక, అర్థాన్ని, ధర్మాన్ని పట్టించుకోకుండా, కామార్థియైనవాడి పరిస్థితి, నీరు తక్కువగా ఉన్న చెరువులో చేప యెట్లా చెడుతుందో అటువంటిది. అందువల్ల, అర్థము, ధర్మము యీ రెండు కూడ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. మేఘాలు యెట్లా అయితే సముద్రజలాలను పీల్చుకొని వర్షిస్తాయో, సముద్రము యెట్లా వర్షంతో నిండుతూ ఉంటుందో, ధర్మార్థాలు ఆ విధంగా పరస్పరపోషకాలు. అందుకని, త్రివర్గాలను, అంటే, ధర్మార్థకామాలను సమపాళ్ళలో సాధించేవాడే గొప్పవాడు, అన్నీ తెలిసినవాడవుతాడని భీముడు తార్కికంగా వివేచన చేసి తన అభిప్రాయాన్ని ధర్మరాజుకు తెలియజేసాడు.
No comments:
Post a Comment