నేకత మెట్టు లుండుదు? మహీపతితోడన పోదు; బుత్రులం
జేకొని పెన్పు; నా పనుపు సేయుము ' నావుడు మాద్రి దద్దయున్
శోకపరీతచిత్త యగుచుం బృథ కి ట్లనియెం బ్రియంబునన్.
అది వసంతకాలం. కుంతీమాద్రిలతో వానప్రస్థం చేస్తున్నాడు పాండురాజు. ఒకనాడు, వసంతఋతు శోభకు ఇంద్రియపరవశుడై, వారించినా వినక, మాద్రితో సంభోగం చేసి, విగతజీవుడై పడిపోయాడు. కిమంద ముని శాప ఫలితాన్ని తలచుకొని, భర్త శవం మీద పడి, పెద్దపెట్టున ఏడుస్తున్న మాద్రి దగ్గరకు వచ్చి, దుఃఖంతో కుంతి యిట్లా అన్నది.
" ఇక నీవు లేచి నాకు చోటివ్వు. నేను పాండురాజుకు ప్రియమైన ధర్మపత్నిని. ఆయనను విడచి నేనుండలేను. ఆయనతో వెళ్ళిపోతాను. పిల్లలను నీవు పెంచి పెద్ద చేయి. ".
ఈ మాటలు విన్న మాద్రి దుఃఖంతో కుమిలిపోయింది.
తేట తెనుగు పదాలతో సరళంగా, మాధుర్య ప్రధానంగా, నాటకీయంగా సాగిన యీ పద్యంలో, కుంతీదేవి శోకం, కోపం, ఎత్తిపొడుపు, సవతి యెడల లోపల దాగియున్న సహజభావం, అన్నీ సమపాళ్ళలో మేళవింపబడి, మానవనైజానికి అతి దగ్గరగా ఉండి, ఒక తెలియని అందాన్ని తెచ్చిపెట్టాయి.
" నా కెడ యిమ్ము లెమ్ము " అనడంలో " ఏడ్చిందిక చాలు లే " అన్న యీసడింపు ఉంది. " కురునాథుమనఃప్రియధర్మపత్ని నేను " అనడంలో " ఆయనకు నేను ప్రియమైన దానిని, అక్కడ కూర్చొనే హక్కు నాకు మాత్రమే ఉంది " అనేదానితో పాటు, " భర్తకు అంత ప్రియమైన దానివి, యీ విధంగా ఆయన చావుకు కారణం కావచ్చునా " ఆన్న ధ్వని, ఎత్తిపొడుపు ఉన్నాయి.
ఇన్ని భావాలను ఒకచోట గుది గ్రుచ్చి మహాశిల్పి నన్నయ యీ పద్యాన్ని చెక్కారు. సామాన్యంగా, తిక్కనగారి అచ్చ తెలుగు పదాలకు మురిసిపోతుంటాము. మరి, నన్నయగారి యీ పద్యం చూస్తే ముచ్చట వేయదూ! ద్రష్టలు కాబట్టి యేదిచేసినా, " లోనారసి " చేస్తారు.
ఈ పద్యం నన్నయ భారతం ఆదిపర్వం పంచమాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment