రామక్ష్మా ఖనన క్రియా ఖరఖనిత్ర గ్రాహితోద్యత్కిణ
స్తోమాస్నిగ్ధకరున్భవద్భవనదాసున్వాదిగా బంపుచో
భూమీ భృత్సభ నోటమైన నయశంబున్ మీకు గాకుండునే?
విష్ణుచిత్తుడు పరమ వైష్ణవ భక్తుడు. విష్ణువు అతనికి కలలో కనపడి, మధురానగరంలోని పాండ్యరాజు కొలువు కూటానికి వెళ్ళి, శాస్త్రచర్చలో అక్కడి పండితులను ఓడించి, వైష్ణవమత స్థాపన చేయమని ఆదేశించాడు. అప్పుడు, విష్ణుచిత్తుడు చెప్పిన పద్యమిది.
" జగత్ప్రభుడవైన స్వామీ! ఇంతకు ముందు, నేను శాస్త్రగ్రంథాలు యేమీ చదువుకోలేదు. నాకు తెలిసిన పనల్లా మీ పూలతోటలో గడ్డపారతో మొక్కలకు పాదులు తీయటం ఒక్కటే. దానివల్ల నా చేతులు కాయలు కాచి మొరటు తేలాయి. అటువంటి నేను రాజు కొలువులో శాస్త్రచర్చలో ఓడిపోతే, ఆ అపకీర్తి మీకు రాదా? "
ఈ పద్యం లోని చాల విశేషాలను పెద్దలు తుమ్మపూడి కోటేశ్వరరావుగారు, ఆముక్తమాల్యదకు వారు వ్రాసిన సౌందర్యలహరి వ్యాఖ్యానంలో వివరించారు. ఆచార్యులవారికి ముందుగా ప్రణామాలర్పిస్తూ, వారు వెలువరించిన భావాలను, నా మాటలలో మీ ముందుంచుతున్నాను.
పద్యం ' స్వామీ ' అనే పదంతో మొదలయింది. శ్రీవైష్ణవ సంప్రదాయంలో, భగవంతుడు యజమాని, భక్తుడు సేవకుడు. అందుకనే, పద్యం మధ్యలో ' భవద్భవన దాసున్ ' అంటాడు విష్ణుచిత్తుడు. భృత్య భృత్య పరిపాలక భృత్య భృత్య.....శ్రీవైష్ణవ సంప్రదాయంలో భాగవత సేవ కూడ చాల ముఖ్యమైనది. విష్ణువు జగత్ప్రభువు. పాండ్యరాజు భూమిభృత్, దేశానికి రాజు, మాత్రమే. అంటే, అతడు జగత్ప్రభువునకు సామంతుడు. అటువంటి చోట ఓటమి ఎదురైతే, అది భగవంతునికి అపకీర్తి తెస్తుంది కదా అని భక్తుని ఆవేదన. ఎందుకంటే, యజమాని చెప్పిన పని చేయడమే సేవకుని కర్తవ్యం. దాని మంచి చెడులతో అతనికి సంబంధముండదు. ఫలితము యొక్క బాధ్యత యజమానిదే. భగవద్గీత చెప్పింది కూడ ఇదే. ఇదే శ్రీవైష్ణవమత రహస్యం. దానిని ఒడిసిపట్టారు రాయలవారు యీ పద్యంలో.
ఇంకొక చమత్కారమైన చర్చ. ఏమీ చదువుకోని విష్ణుచిత్తుడు సంస్కృతంలో ఇంత దీర్ఘసమాసాలతో పద్యం యెట్లా చెప్పాడని? దానికి సమాధానం, మనకు " ఆ నిష్ఠానిధి గేహసీమ " అనే పద్యంలో దొరుకుతుంది. పలు ప్రాంతాలనుండి తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులతో అతడు సంస్కృతంలోనే మాట్లాడేవాడు.....( ' నాస్తి శాక బహుతా, నాస్త్యుష్ణతా, నాస్త్యపూపో, నాస్త్యోదన సౌష్ఠవం చ కృపయా భోక్తవ్య ' మన్మాటలున్ ....... అయ్యో! మీకు ఇంకా ఎక్కువ కూరలు వడ్డించలేకపోయాను, ఇంకొంచెం వేడిగా ఉంటే బాగుండేది, ఎక్కువ పిండివంటలు చేయలేకపోయాము, ఇంకా మంచి అన్నం వండితే బాగుండేది, నా మీద దయతో భోజనము చేయండి, అనే మాటలు ). అతడు శాస్త్రగ్రంథాలు చదువ లేదు, కానీ, సంస్కృతంలో మాట్లాడేవాడు.
ఈ పద్యం, దీర్ఘసమాసాలతో ఉందన్న మాటే గాని, ఒక్కసారి వల్లెవేసి మననం చేసుకుంటే, ఆ మాధుర్యంలో కొట్టుకుపోవలసిందే. అందమంతా సంస్కృత సమాసాల్లోనే ఉంది. అపఠిత, అయశముల్, వంటి పదాలు రాయలవారి ముద్ర.
ఇంత చక్కని పద్యం శ్రీకృష్ణదేవరాయలవారు రచించిన ఆముక్తమాల్యద అనే ప్రబంధము ద్వితీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment