ఆ నాకపతి గజము ష
డానను గని వెఱచి పఱచె నది చోద్యమె పం
చానున కోడు కరులు ష
డానన విపరీత గతి భయంపడకున్నే?
ఇది చాల చిన్న పద్యము. అయితేనేమి, అందమైన కందము. ఈ పద్యములో వాడిన రెండు పదాలు ' షడానను ' , ' పంచానను ' అనేవి పద్యానికి అర్థాన్ని, అందాన్ని సంతరించి పెట్టాయి.
నారదుని ప్రేరణతో, కుమారస్వామిపై యుద్ధం చేయడానికి, ఐరావతము అనే ఏనుగుని యెక్కి వెళ్ళాడు ఇంద్రుడు. కుమారస్వామి షడాననుడు, ఆరు ముఖాలు కలిగినవాడు. ఆరు ముఖాలు కలిగిన కుమారస్వామిని చూసి ఐరావతం పారిపోయింది. ఇందులో వింత యేమీ లేదంటున్నాడు కవి. ఎందుకంటే, పంచాననాన్ని చూసి ఏనుగు భయపడి పారిపోవడం సహజమే కదా! ఇక్కడ, పంచానన శబ్దానికి రెండు అర్థాలున్నయి. పంచాననము అంటే విశాలమైన ముఖము కలది సిం హమని, ఐదు ముఖములు కలది అని. అందువలన, పంచాననానికి ( సిం హమునకు/ ఐదు ముఖములు కల దానికి ) భయపడే ఏనుగులు, షడాననుని (ఆరు ముఖములు కల వాని ) ప్రతికూల గతికి భయపడవా?
ఈ పద్యము నన్నెచోడుని కుమారసంభవము దశమాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment