తరుణి! యివి మేలు బాహ్యతీర్థములకంటె
మానవుం డివి యేమఱి మధురవాణి!
బాహ్యతీర్థంబు లాడ నిష్ఫలము సూవె.
తీర్థంబు సత్య మింద్రియనిగ్రహము తీర్థ
మనసూయ తీర్థంబు వనరుహాక్షి!
తీర్థంబు దానంబు తీర్థంబు సంతోష
మనుకంప తీర్థంబు కనకగౌరి!
బ్రహ్మచర్యంబు తీర్థంబు తీర్థము ధృతి
యమము తీర్థము విద్రుమాధరోష్ఠి!
సమత తీర్థంబు విజ్ఞానంబు తీర్థంబు
పుణ్యంబు తీర్థంబు పువ్వుబోడి!
తీర్థములు మానసంబులు ధీవిశుద్ధి
యతిశయిల్లంగ నివి యాడ కాడినట్టి
పంచజనులకు గలహంసపక్షిగమన!
బాహ్యతీర్థావలులు తీర్థఫలము నీవు.
కాశీక్షేత్రాన్ని వదలిపెట్టి తీర్థయాత్రలు చేస్తున్న అగస్త్యుడు, లోపాముద్రకు బాహ్యతీర్థాలు, మానసిక తీర్థాలను గురించి చెప్పాడు. అంతేగాక, మానసికతీర్థాలు మేలైనవని, ముక్తిదాయకాలని చెప్పాడు. అందువల్ల, యీ సూక్ష్మాన్ని గ్రహించకుండా, పుణ్యక్షేత్ర సందర్శన చేయడం వల్ల ఫలితమేమీ ఉండదని కుండబద్దలుకొట్టి మరీ కుంభసంభవుడు యీ పద్యంలో చెప్పాడు.
మనోవాక్కాయకర్మల సత్యవాక్పరిపాలన చేయడం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనడం, అసూయ పడకుండ ఉండటం, దాతృత్వము, సంతోషంగా ఉండటం, కరుణ కలిగి ఉండటం, బ్రహ్మచర్యము, ఆపదలు కలిగినపుడు ధైర్యంగా ఉండటం, హింస చేయకుండా ఉండటం, అందరినీ ఒకటిగా చూడటం, వేదాంత మార్గంలో జ్ఞానం పొందటం, పుణ్యకార్యాలు చేయడం, మానసిక తీర్థాలనబడతాయి. అట్లాగాకుండా, పైన చెప్పిన గుణాలను పెంపొందించుకొనకుండ, మానసిక పరివర్తన కలుగకుండ, మనిషి యెన్ని తీర్థయాత్రలు చేసినా, పుణ్యఫలం దక్కదని అగస్త్యుడు నొక్కి మరీ చెప్పాడు.
తీర్థయాత్రాఫలాన్ని గురించి యింత చక్కగా చెప్పబడిన యీ పద్యం శ్రీనాథుని కాశీఖండము తృతీయాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment