దీర్థయాత్రకు సమ్మతింప దాత్మ
దీర్థంబు లాడంగ దివుట లేకుండిన
బ్రతిబంధదురితంబు వాసిపోదు
ప్రతిబంధదురితంబు వాసిపోకుండిన
గాసి కేగెడునట్టికడక లేదు
శ్రీకాశీపురక్షేత్రవాసము లేక
విజ్ఞానదీపంబు విస్తరిలదు
జ్ఞానమున గాని మోక్షంబు సంభవింప
దతివ! జ్ఞానం బనంగ వేదాంతవాక్య
సంభవం బైన దదియపో జ్ఞానమండ్రు
తరుణి విజ్ఞాన మీ సూక్ష్మ మెఱిగి కొనుము.
శివుని ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదంటారు. అదే విధంగా, దైవానుగ్రహం లేకపోతే, తీర్థయాత్ర చేయాలనే ఆలోచన రాదు. తీర్థయాత్ర చేయాలనే కోరిక కలుగక పోతే, ఆధ్యాత్మికతకు అడ్డగింపుగా ఉన్న దుష్కర్మ యొక్క ఆధిక్యత పోదు. ఆధ్యాత్మికతకు అడ్డంగా ఉన్న దుష్కర్మ ఆధిక్యత తగ్గకుంటే, కాశికి వెళ్ళలనే ప్రయత్నమే జరుగదు. కాశీక్షేత్రములో ఉండటమనేది లేనినాడు, విజ్ఞానమనే దీపపు వెలుగు లోపల వ్యాపించదు. జ్ఞానమనేది సమకూడకపోతే మోక్షం కలుగదు. జ్ఞానమనేది ఉపనిషత్తుల సారమైన వైరాగ్యభావన వల్ల కలుగుతుంది. ఈ ధర్మసూక్ష్మాన్ని తెలుసుకోవాలని అగస్త్యుడు, తనభార్య లోపాముద్రకు చెప్పాడు.
ఈ పద్యము శ్రీనాథ కవిసార్వభౌముని కాశీఖండము తృతీయాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment