ప్రామిన్కు చిట్టచివళ్ళలో నసురుల దోరించునట్టి కటారి యొకడు
ప్రామఱ్ఱిక్రీనీడ బాఠమ్ము ముసలులౌ మునులచే జదివించు పోఱడొకడు
పాలవెల్లి కరళ్ళపై వెలికింతలై కాలివ్రేల్చీకెడు కందొకండు
పసిమియై గాలికిని రాలిపడిన యొక్క
నలుసు నివ్వరిముల్లైన వెలుగొకండు
స్థూలమై వచ్చివచ్చి తా సూక్ష్మమగుచు
జనపతికరస్థమగు పాయసమున జొచ్చె.
దశరథుడు పుత్రలాభాన్ని కాంక్షించి యాగాన్ని చేశాడు. యాగకుండంలోనుండి ప్రాజాపత్య పురుషుడు పాయసపాత్రతో ఆవిర్భవించి, దానిని దశరథునికి అందజేసాడు. ఆ పాయస పాత్రలోనికి శ్రీమహావిష్ణువు వెలుగు రూపంలో ప్రవేశించడాన్ని వర్ణించిన అద్భుతమైన సీస పద్యమిది. ఆ వెలుగు యెవరు?
పాలకడలిపై శేషతల్పమున పవళించి, మునులు స్తోత్రం చేస్తుండగా సంతోషపారవశ్యంతో తేలియాడేవాడొకడు, సోమకాసురుని నుండి వేదములను రక్షించి, వేదోద్ధరణ చేసిన ఖడ్గవిద్యానిపుణుడు, ఉపనిషత్స్వరూపుడు అయినవాడొకడు, మఱ్ఱిచెట్టు చల్లని నీడలో ముసలివారైన, అంటే, పరమాత్మభావనతో పండిపోయిన, శిష్యులచే వేదాధ్యయనం చేయించే యువకుడొకడు, పాలసముద్రపు తరగలపై వెల్లకిలా పడుకొని బొట్టనవ్రేలు చీకే శిశు వొకడు, బంగారు రంగులో ఉండి, గాలికి రాలిపడిన వడ్లగింజ ముల్లు వంటి సూక్ష్మమైన వెలుగొకడు, ముందు పెద్దగా కనపడి, రాను రాను చిన్నదయి, దశరథుడు పట్టుకున్న పాయస పాత్రలో ప్రవేశించింది.
మునులచే పాఠాలు చదివించింది హయగ్రీవ స్వరూపంగాను, లేక శివకేశవుల అభేదబుద్ధితో చూస్తే, దక్షిణామూర్తి స్వరూపంగాను భావించవచ్చు.
నీలతోయద మధ్యస్థా ద్విద్యుల్లేఖేవభాస్వరా/ / నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా / / తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః/ స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్. " అన్న తైత్తరీయ అరణ్యకం లోని నారాయణ సూక్తమునకు వ్యాఖ్యానంగా, " నీళగళా! రఘూత్తముడు నీవును యిద్దరు గానీ యట్లుగా నోలి భజించితిన్ " అన్న విశ్వనాథవారి అద్వైతబుద్ధికి నిలువుటద్దంగా యీ పద్యం నిలుస్తుంది.
పృదాకువు అంటే పాము. ఇక్కడ ఆదిశేషువు.
పద్యంలో విశ్వనాథవారు వాడిన " పోఱడు, కందు, కరళ్ళు " వంటి అచ్చ తెలుగుపదాలు, " ముసలులౌ మునులచే, కాలు వ్రేల్చీకెడు వంటి అందమైన తెలుగు గొలుసుకట్టు పదాలు పద్యానికి క్రొత్త అందాన్ని తేవడమే గాక, మనసుకు అందని, గుండెలో గుడి కట్టుకొన్న దివ్యమైన ఆధ్యాత్మికానుభూతికి అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా, ' వెలుగు ' అని విశ్వనాథవారు వాడిన చిన్న తెలుగు పదం, " వెలుగు మఱొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థ భూతమై " అన్న సుందరకాండము పద్యం క్రీనీడలో అర్థం చేసుకుంటే, ఆ పదం మొత్తం పద్యాన్ని యెంత దీప్తిమంతం చేస్తున్నదో, పరమ అర్థ భూతమై, పరమార్థభూతమై నిలుస్తున్నదో తెలుస్తుంది.
ఏమి విశ్వనాథ! ఏమి ఋషిత్వము!
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రాయణ కల్పవృక్షము బాలకాండము ఇష్టి ఖండము నందలిది.
No comments:
Post a Comment