నలి సుమిత్ర యుపాసనాస్వరూప
విజయ రమాకార వినయాంబుధి సుమిత్ర
కైకేయి మధుసామగానమూర్తి
కౌసల్యనవశరత్కాల మందాకిని
సితపుండరీకంబు శ్రీసుమిత్ర
మందారపుష్పంబు మహిళామణి సుమిత్ర
కైకేయి నును నల్లకల్వపూవు
ధర్మకామంబు లీ రెంట దశరథుండు
ముగురు భార్యలందును రసమూర్తులందు
నమృత సౌఖ్యానుభూతి, నధ్యయనసుఖము,
తీర్థభోగ సుఖమ్ము సిద్దింప గనియె.
ఈ పద్యంలో, కౌసల్య ఒకసారి, సుమిత్ర రెండు సార్లు , కైకేయి ఒకసారి, వర్ణించబడ్డారు. ఈ క్రమం అన్ని పాదాల్లో పాటింపబడ్డది. ఇట్లా చేయడం వల్ల, కౌసల్యకు రాముడొకడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు, కైకేయికి భరతుడు, పుట్టబోతున్నారనే భావికథార్థ సూచన చేయడం జరిగింది అనుకుంటే, యీ మాత్రపు చమత్కారం సామాన్యుడైన కవి యెవరైనా చేయగలడు. మరి విశ్వనాథవారి గొప్పదనం వేరే ఉంది. వేదార్థమును శిల్పరమణీయంగా గుప్పించి చెప్పిగాని వదలని లక్షణం ఇందులో ఉంది. ఈ సీసపద్యంలో రామాయణ తత్త్వమంతా నిక్షిప్తం చేయబడింది. ఏ విధంగా? శ్రీరాముడు మోక్షస్వరూపుడు. సర్వ కర్మబంధాలని త్రెంచుకొంటే గాని దొరకని మహాపదార్థం మోక్షం. శ్రీమహావిష్ణువు కౌసల్యాదేవి గర్భంలో జన్మించబోతున్నాడు. ఆ తల్లి యెంత పవిత్రురాలు. సాక్షాత్తు మోక్షస్వరూపిణి. తల్లి గుణాలు కొడుక్కి సంక్రమించాయా? లేక, స్వామి తన మోక్షస్వరూపాన్ని తల్లికి యిచ్చి, తాను ఆమె యందు అవతరించాడా? ఒకవైపున లోకమర్యాద, ఇంకొకవైపు అవతార రహస్యం, యీ పద్యంలో ధ్వనిస్తున్నాయి.
రెండవ ఆమె సుమిత్ర. ఈ తల్లి లక్ష్మణ శత్రుఘ్నులను కన్నది. ఆమెకు, రెండు విశేషణాలు వాడబడ్డాయి. సుమిత్ర ఉపాసనాస్వరూప. విజయరమాకార వినయాంబుధి సుమిత్ర. ఉపాసనా స్వరూప అన్నది లక్ష్మణునికి, విజయరమాకార వినయాంబుధి అన్నది శత్రుఘ్నునికి వర్తిస్తాయి. లక్ష్మణుడు ఉపాసనాస్వరూపుడు. శ్రీరామోపాసనా దురంధరుడు. ఆయనను విడిచి ఒక్క నిమిషమైనా ఉండడు. అదట్లా ఉంచితే, సుమిత్ర ఉపాసన యెటువంటిది? సుమిత్రకు కౌసల్య ఒక దేవీస్వరూపంగా కనపడుతుంది. సుమిత్ర యెప్పుడూ కౌసల్యకు దగ్గరగానే ఉంటుంది. కౌసల్యకు ఏం జరిగినా, తనకు జరిగినట్లే తృప్తి పడుతుంది. దశరథుడు పుత్రకామేష్టి చేయాలనే తన ఆలోచనను సుమిత్రకు చెప్పినప్పుడు, ఆమె రాజుతో:
..........పట్టపు రాణి కక్కకున్
తనయుడు కల్గుటొక్కటియు నాకును గల్గుట యొక్కటా! భవ
త్తనయుడు నీదుభార్యలకు దా దనయుండె యగున్ గదా! "
సుమిత్ర యొక్క ఈ మాటలు, ఆమె కౌసల్యను యెట్లా ఉపాసిస్తున్నదో తెలియజేస్తాయి. కౌసల్యను సుమిత్ర యెట్లా ఉపాసిస్తున్నదో, రాముని లక్ష్మణుడు అట్లా ఉపాసిస్తున్నాడు.
ఇక సుమిత్రను గురించి రెండవ విశేషణం. విజయరమాకార వినయాంబుధి సుమిత్ర.
శత్రుఘ్నుడు వీరరసావతారుడు. తన అన్నల యందు వినయసముద్రుడు.
మూడవ ఆమె కైక. ఈమె పాత్రను రామకథాభాష్యకారులెవరును తెలిసికొన లేనంత సమృద్ధిగా కల్పవృక్షకారుడు తెలిసికొన్నాడు. ఆ తెలిసిన రహస్యము నంతటినీ " మధు సామగానమూర్తి" అన్నదాంట్లో ధ్వనింపజేసాడు. రామాయణము వేదము. వేదములందు సారభూతం సామవేదం. కేవలం వేదాన్ని చదివిన వారికంటే, దానిని అర్థం చేసుకొన్న జ్ఞానులు ఉత్తములు. కావున, కైకేయి మధుసామగానమూర్తి అంటే, రామాయణ వేదం యొక్క సారాన్ని, రహస్యంగా తెలిసికొన్నదని అర్థం. రామాయణం వేదమని ఏ రకంగా చెప్పగలము? మధు అనే శబ్దం నుండి పుట్టినదే మాధవుడు అన్న పేరు. అంటే, శ్రీమహావిష్ణువు. విష్ణువే రాముడిగా అవతరించాడన్న రహస్యం కైకకు తెలుసు. రాముడంటే కైకకు పట్టరాని ప్రేమ. విష్ణువు పూరించే శంఖము యొక్క అవతారమే భరతుడు. ఆ శంఖంలో నుంచి వచ్చే నాదమే సామగానం. పరమ భాగవతోత్తముడైన భరతునికి జన్మనిచ్చిన కైకేయి మధు సామగానమూర్తి. రాముని ఇంత ప్రేమించిన ఆ తల్లి, రాక్షస సOహారార్థం, అతడిని అడవులకు పంపించి అపనిందల పాలయింది. అయినా, ఆమె వెనుకాడలేదు. అదీ " కైకేయీ సముపజ్ఞమియ్యది " అని యుద్ధకాండము ఉపాసంహరణ ఖండములో అన్న భరతుని మాటలకు అర్థం. ఇంత అర్థాన్ని ఒక్క పద్యంలో ధ్వనింపజేసాడు కనుక విశ్వనాథ ఋషి. ఇటువంటి పద్యాలు కొల్లలుగా ఉన్న కావ్యం కల్పవృక్షం.
ఇంకా ఈ పద్యం లోని విశేషాలను చూద్దాం.
కౌసల్య నవశరత్కాల మందాకిని. సితపుండరీకంబు శ్రీసుమిత్ర. మందారపుష్పంబు మహిళామణి సుమిత్ర, కైకేయి నును నల్లకల్వపూవు. సితపుండరీకము అంటే తెల్ల కలువపూవు. లక్ష్మణుడు ఆదిశేషువు అవతారం. ఆయన మేని చాయ తెలుపు. మందారపుష్పంబు మహిళామణి సుమిత్ర అని ఇంకొక విశేషణము. వీరరసావతారుడు శత్రుఘ్నుని ధ్వనింపజేయడనికి యెఱుపు రంగు గల మందారపుష్పాన్ని వాడారు విశ్వనాథ. ఏ రసానికి ఏ వర్ణం వాడాలో అలంకారికులు నిర్ణయించారు.
ఇక కౌసల్య నవశరత్కాలమందాకిని అన్న దానికి సితపుండరీకంబు శ్రీసుమిత్ర ఆన్న దానికి సన్నిహిత సంబంధం ఉంది. శరత్కాలపు వెన్నెలలో గంగానది తళ తళ మెరిసిపోతుంది. ఆ తెల్లదనంలో, తెల్లకలువ యొక్క తెలుపు విడదీయలేనంతగా కలిసిపోతుంది. అదీ, కౌసల్యాసుమిత్రల, రామలక్ష్మణుల విడదీయరాని బంధం.
కైకను గూర్చి మరియొక వర్ణన. ఆమె నును నల్లకలువ అనటం. లక్ష్మణుడు తెల్లకలువ. భరతుడు నల్లని కలువ యగుటలో సొగసున్నది. భరతునకు రామునకు సామ్యమున్నది. రాముని వలె భరతుడు నల్లనివాడు. రాముని స్థానమున రాజ్యము నేలినవాడు. శ్రీరాముడు మందాకిని కాగా, లక్ష్మణ భరతులు తెలుపు నలుపు కలువలైనారు. కలువల చేత గంగానదీ గుణోత్కర్ష ప్రకాశించినట్లుగా, లక్ష్మణ భరతులు సోదరులు కాగా, రాముడు లోకారాధ్యుడైనాడు.
క్రింది తేటగీతిలో, ధర్మము, కామము యీ రెండిటినీ పాటిస్తూ , దశరథుడు తన ముగ్గురు భార్యలందును, రస సిద్ధిని పొందాడని చెప్పారు. ఆ ముగ్గురు భార్యలు రసమూర్తులు. రసోవై సహః అని వేదము. రసమనగా ఆనందము. భగవంతుడు ఆనందమయుడు. దశరథుడు ఏ రకమైన ఆనందాన్ని పొందాడు? కౌసల్య యందు అమృతసౌఖ్యానుభూతి. అమృతత్త్వాన్ని ప్రసాదించే అవతారమూర్తికి జన్మనిచ్చినది కనుక. సుమిత్ర యందు అధ్యయన సుఖము. సుమిత్ర ఉపాసనా స్వరూప. లక్ష్మణుడు రామోపాసకుడు. లక్ష్మణుడు శేషుని అవతారము. అధ్యయనమనగా వాక్కునకు సంబంధించినది, వ్యాకరణమునకు సంబంధించినది. వ్యాకరణమునకు పరమ ప్రమాణమైన పతంజలి శేషుని అవతారము. కనుకనే పెద్దనగారు, ప్రవరుని భాషాపరశేషభోగి అన్నారు. ఇక కైకేయి యందు తీర్థభోగ సుఖము పొందుచున్నాడు. గంగానది అందరి పాపాలు కడిగి, తాను కలుషితమౌతుంది. కైకేయి, తాను అపనిందను భరించి, లోకానికి శుభాన్ని చేకూర్చింది. యదార్థానికి, గంగానది వలె కైక పవిత్రురాలు.
బహుథా రూపిత కథాంశముల సారమిట్లుండునా! ఇదీ విశ్వనాథ ఋషిత్వము.
ఈ పద్యానికి ఇంత చక్కని వ్యాఖ్యానము " విశ్వనాథ శారద ప్రథమభాగము నందలి బాలకాండములోని రమణీయ శిల్పఘట్టములు " అను వ్యాసము నుండి గ్రహించాను. దురదృష్టవశాత్తు, వ్యాసము ముందు భాగపు కాగితము చిరిగిపోవడం వల్ల, వ్యాసకర్త పేరు నాకు లభించలేదు. ఈ పద్యానికి నేను వ్రాసిన యీ మాటలు , భావము ఆ వ్యాసకర్తకే చెందుతాయని సవినయంగా విన్నవించుకుంటూ, వారికి నమస్సుమాంజలులు అర్పిస్తున్నాను.
ఈ సీసపద్యం కవిసమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము బాలకాండము ఇష్టి ఖండము లోనిది.
No comments:
Post a Comment