అద్వితీయ మ్మేక మపరిణామ ప్రాప్త మపరిమేయ మ్మది యచ్చ తెలివి
అట్టి జ్ఞానము తోడ నైకకాలికముగా నాదిమునుల్ గలరా ప్రభువులు
యోగనిద్రాముద్ర నూని తామే యదియ యదియ తామై యుందు రమృతకళలు
ఆత్మతో నాదిమును లెట్టు నవని తోడ
నాదినృపు లైకకాలికులై చరింత్రు
ఆ నృపులయందు నిక్ష్వాకు వంబుజాప్తు
మనుమడొప్పు వైవస్వత మనువు కొడుకు.
శ్రీమద్రామాయణకల్పవృక్షము కావ్యానికి ఉన్న విశిష్టతల్లో, కథారంభాన్ని ఆత్మపదార్థ వివరణతో చేయడం ఒకటి. సామాన్యంగా, కథారంభాన్ని పురవర్ణన లేక వ్యక్తి వర్ణనతో చేస్తుంటారు. సంస్కృత రామాయణానికి భిన్నంగా, అవతారమూర్తి కథను ఆత్మపదార్థ వివరణతో ఆరంభించడం ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒక అపూర్వమైన విషయం.
ఆత్మ నిత్యత్వాన్ని గురించి ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. భగవద్గీత ఆత్మ నిత్యత్వాన్ని గురించి చెబుతూ " అజో నిత్యః శాశ్వతోయం పురాణం " అంటుంది. అది, దేశకాలముల చేత నియంత్రింపబడనిది. సత్తు, చిత్తు, ఆనందముల సమ్మిళితమే ఆత్మ అని - " సచ్చిదానంద స్వరూపం జ్ఞాత్వా ఆనందరూపావస్థితిరేవ సుఖం " - అట్టి సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకొనడమే సుఖాన్ని కలిగిస్తుందని నిరాలంబోపనిషత్తు తెలియజేస్తున్నది. ఆత్మ ఒక్కటే పరబ్రహ్మతత్వము, వేరైనదేదీ లేదు - " ఏకమేవాద్వితీయం బ్రహ్మ " అని, ఆత్మపదార్థము మార్పులు చెందనిదని, నాశరహితమని, పరిమితులు లేనిదని, ఆత్మను గూర్చిన యెరుకయే నిజమైన జ్ఞానమనీ ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆదిమునులు అటువంటి ఏకోన్ముఖమైన జ్ఞానంతో, యోగనిద్ర అనే సమాధి స్థితిలో, అమృతానందాన్ని అనుభవిస్తూ , బ్రహ్మాత్మైక సంధానం కలిగి ఉండేవారు. ఆదిమునులు ఏ విధమైన ఆత్మజ్ఞానంతో ఉండేవారో, ఆదినృపులు కూడ అటువంటి జ్ఞానంతో యీ భూమిని ధర్మం తప్పకుండ పాలించేవారు. అటువంటివాడే సూర్యుని మనుమడు, వైవస్వతమనువు కొడుకు అయినటువంటి ఇక్ష్వాకు మహారాజు.
ఇక్ష్వాకుల వంశ ప్రశస్తిని చేసే యీ మొట్టమొదటి పద్యం కవిసమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము బాలకాండము ఇష్టి ఖండము లోనిది.
No comments:
Post a Comment