ముదిమదిదప్పిన మొదటి వేల్పు
నచటి రాజులు బంటు నంపి భార్గవునైన
బింకాన బిలిపింతు రంకమునకు
నచటిమేటికిరాటు లలకాధిపతినైన
మును సంచి మొదలిచ్చి మనుప దక్షు
లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి
నాదిభిక్షువు భైక్ష మైన మాన్ చు
నచటి వెలయాండ్రు రంభాదులైన నొరయ
గాసెకొంగున వారించి కడప గలరు
నాట్యరేఖాకళాదురంధరనిరూఢి
నచట బుట్టిన చిగురు గొమ్మైన జేవ.
ఆర్యావర్తంలో అరుణాస్పదం అనే నగరం ఉంది. ఆ నగరంలోని నాలుగు వర్ణాలవారిని, వేశ్యలను వర్ణించిన పద్యమిది.
ముందు బ్రాహ్మణులను గురించి. ఆ నగరంలోని బ్రాహ్మణులు సకలవిద్యాపారంగతులవడం చేత, బ్రహ్మను కూడా లెక్కజేయరు. వేదాలు అతిప్రాచీనమైనవి. అవి బ్రహ్మ ముఖం నుండి వెలువడ్డాయి. అందుకని, ఆయన ముదిమతితప్పిన మొదటివేల్పు. వయసు మళ్ళినవాడు. అక్కడి క్షత్రియులు సేవకుడి చేత కబురుపంపి, పరశురాముణ్ణి కూడా గర్వంతో యుద్ధానికి పిలువగలరు. అంటే, యుద్ధానికి యెప్పుడూ వెనుకాడరు. అక్కడి కోమటులు, కుబేరునికి కూడా ధనమివ్వగలిగిన దక్షత కలవారు. అంటే, అంతటి ఐశ్వర్యవంతులు. ఇక అక్కడి శూద్రులు, పంటపండించిన సంపదతో, శివుని భిక్షుకత్వాన్ని కూడా మాన్ పించగలరు. అంటే పంటలు పండించడంలో అంతటి నేర్పరులు. అక్కడి వేశ్యలు, వారి నాట్యవిద్యా కౌశలంతో, రంభ మొదలైన అప్సరసలను కూడా యెదిరించగలరు. అంటే, సంగీతనృత్యములయందు అంత ఆరితేరినవారు. ఇంత యెందుకు? ఆ నగరంలో ఉన్న చిగురుచెట్టుకొమ్మ కూడ గట్టిగా ఉంటుంది.
పెద్దనగారు వైశ్యులను వర్ణిస్తూ " మును సంచి మొదలిచ్చి " అనే ప్రయోగం చేశారు. తెనాలి రామకృష్ణకవి " సంచి మొదలు చేసి " అనే పదబంధాన్ని, పెద్దన్నగారి " మును సంచి మొదలిచ్చి " అన్న ప్రయోగంతో స్ఫూర్తి పొంది అయినా కావచ్చు లేక స్వతంత్రంగానో, వారి పాండురంగ మాహాత్మ్యము అనే కావ్యంలో వాడారు. " మును సంచి మొదలిచ్చి " అన్నా " సంచి మొదలు చేసి " అన్నా, మొదటి సంచిగా చేయడం అని అర్థం. అంటే తరిగిపోవు. వారి వద్ద అటువంటివి లెక్కలేనన్ని ఉన్నాయన్నమాట.
వారకాంతల వర్ణనలో, " కాసె కొంగున " అంటే , కొంగు వెనుకకు తీసి దోపడము , అనే ప్రయోగం చేశారు పెద్దనగారు. " కాసె బోసె " అనే వాడుకమాట, ఆడవాళ్ళు చీరకట్టే విధానం తెలుగువారిలో ఉంది. బహుశా, అది " కాసె బోసి " అయ్యుంటుందని నా అభిప్రాయం. కావచ్చును కాకపోవచ్చును, మన్నించవలసినది. " కాసె బోసె " అన్నాకూడ " కొంగు వెనుకకు తీసి " అన్న అర్థమే వస్తున్నది కావున ఇబ్బంది లేదు.
కవిసమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణగారు " కావ్యపరీమళము" అనే గ్రంథంలో " చిగురు కొమ్మైన చేవ " అనే దానికి చక్కని వివరణ ఇచ్చారు. చదవండి.
" శ్రీకృష్ణదేవరాయలవారు విజయనగరము నుండి పాలించుచు ప్రధానముగ పెనుగొండ యందుండెడివారు. పెనుగొండలో కోట యున్నది. ఈ కొండ మీద చిగురుచెట్లని కొన్ని కలవు. ఆ చెట్టు పేరు చిగురు చెట్టు. ఆ చెట్టు చాలా పెళుసు. ములగచెట్టు వంటిది. చిగురు కొమ్మ యనగా లేతకొమ్మయని యర్థం కాదు. అచటి చిగురు చెట్టయినను మంచి చేవ కలది. విఱిచినచో విఱుగదని యర్థము. పెద్దన్నగారు పెనుగొండలోని తానెఱిగిన యీ చెట్టును అరుణాస్పదములో నున్నట్లు వర్ణించెను. "
పై పద్యము అల్లసాని పెద్దనగారి మనుచరిత్రము ప్రథమాశ్వాసము లోనిది.
No comments:
Post a Comment