బలహీనుడు, ధనము గోలుపడిన యతడు, మ్రు
చ్చిల వేచువాడు, గామా
కుల చిత్తుడు నిద్ర లేక కుందుదు రధిపా!
ఇక్కొఱగాముల లోపల
నొక్కటి నీ చిత్తవృత్తి నొందెనొ? యొరు సొ
మ్మొక్కటి గుడువ దలంచితొ?
నిక్కము గత మేమి సెపుమ నిద్ర సెడుటకున్.
తిక్కన భారతం ఉద్యోగపర్వం ద్వితీయాశ్వాసంలోని యీ రెండు పద్యాలను చదువుతుంటే, తిక్కన తెలుగుభాషకు యెంత సేవ చేసారో, భావితరాల కవులకు, యెంత తెలుగుపద సంపదను కూడబెట్టి ఇచ్చారో తెలుస్తుంది. మనందరికీ అనుభవంలో ఉన్న ఆశర్యకరమైన విషయ మేమంటే, కష్టమైన సంస్కృతపదాలకు అర్థం ఒక్కొక్కప్పుడు స్ఫురిస్తుంది గానీ, కొన్ని తెలుగు పదాలకు జుట్టు పీక్కున్నా అర్థం తెలియదు. అలాగని, నిఘంటువులో వెదుకుదామంటే, కొన్ని అచ్చ తెలుగు పదాలకు నిఘంటువులలో కూడా అర్థం దొరకదు. తిక్కన వాడిన అటువంటి అచ్చ తెలుగు పదాలకు పెద్దలు చక్కని అర్థాలను వారి వారి వ్యాఖ్యానాలలో వివరించారు. అటువంటి తెలుగు పదాలను వాడి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన నన్నెచోడుడు, తిక్కన సోమయాజి, పాల్కురికి సోమనాథుడు వంటి వారు మన తెలుగువారికి ఆరాధ్యనీయులు, ప్రాతఃస్మరణీయులు. ప్రస్తావికంగా, ఆధునికులలో ఆ కోవకు చెందిన ఇంకొక మహాకవి తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారు. తుమ్మలవారికి అభినవతిక్కన అన్న బిరుదు తెలుగుజాతి వారికి అందించింది . కానీ, తిక్కనసోమయాజి మీద ఉన్న ఆరాధనాభావము, గౌరవంతో, ఆ బిరుదును వారు స్వీకరించక, నిరాడంబరంగా, తెనుగులెంక, అనగా, తెలుగు భాషకు సేవకుడను, అనే బిరుదును మాత్రం స్వీకరించారు.
ఇక ప్రస్తుత విషయానికొస్తే, పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళిన సంజయుడు తిరిగివచ్చి, అక్కడి సంగతులు చెప్పడం ప్రారంభించాడు. అలసిపోయి ఉండడం వల్ల, తక్కిన సంగతులు మరుసటి రోజున చెబుతానన్నాడు. భయాందోళనలకు గురైన ధృతరాష్ట్రుడు, విదురుడిని తన సమక్షానికి రప్పించుకొని, సంజయుడు చెప్పిన మాటలు విన్న తరువాత తన మనస్సు కలత చెందిందనీ, నిద్ర పట్టడం లేదనీ, శరీరమంతా నిప్పుల్లో పొరలినట్లుందనీ చెప్పాడు. అంతా విన్న విదురుడు, ఎవరికైనా నిద్ర పట్టడం లేదంటే, దానికి యీ క్రింద చెప్పినవి కారణమై ఉంటాయని చెప్పాడు.
ఎదుటివాడు బలవంతుడైనప్పుడు బలహీనుడికి, డబ్బు పోగొట్టుకొన్నవాడికి, యెప్పుడెప్పుడు దొంగతనం చేద్దామా అని కాచుకు కూర్చున్న వాడికి, కామంతో దహించుకు పోతున్నవాడికి, నిద్ర పట్టదు.
పైన చెప్పిన నలుగురే కాక, ఇంకొకరిని కూడా యీ జాబితాలో చేర్చాడు విదురుడు. ఇతరుల ధనాన్ని తానొక్కడే అనుభవించాలనే దుర్బుద్ధి ఉన్నవాడు. అన్నిటికంటే, ధృతరాష్ట్రుణీ, అతని పుత్రరత్నాలను దృష్టిలో పెట్టుకొని చూపిన యీ కారణం, ధర్మానికి ప్రతిరూపమైన విదురుని ఎత్తిపొడుపు అనేది సుస్పష్టం.
పద్యాలు చిన్న కందాలే కానీ, సహృదయ పాఠకులకు ఆరబోసిన అందాలు.
No comments:
Post a Comment