నిషధాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న
సంచరణమున వర్తించుటయును
నదితి గర్భంబున నవతారమై వామ
నాకారమున హరి యడగుటయును
జనని యూరు ప్రదేశంబున నతి నిగూ
ఢముగ నౌర్వుండు డాగుటయును
ధేను శరీర విలీనుడై యజ్ఞాత
చర్య మార్తాండుండు సలుపుటయును
వినమె! యిట్లు వడిన వీరలు పదపడి
తనకు నగ్గమైన తఱి జయింప
రెట్లు ప్రబల రిపుల నీవును నాపద
కోర్చి భంగపాటు దీర్చికొనుము
శ్రీమదాంధ్రమహాభారతము విరాటపర్వము ప్రథమాశ్వాసములో కనుపించే యీ సీసపద్యంలో మొత్తం నాలుగు కథలు దాగి ఉన్నాయి. అవి, వృత్రాసుర వధానంతరం, బ్రహ్మహత్యాదోషం తగిలి, ఇంద్రుడు నిషధపర్వతం మీద తలదాచుకొన్న కథ ఒకటి. రెండవది, విశ్వవ్యాపియైన హరి, పొట్టివాడై అదితి కడుపున పుట్టిన వామనావతార గాథ. ఈ రెండు చాలమందికి తెలిసిన కథలు. అందువల్ల, ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఔర్వుని కథ, సూర్యుడు ధేనువు శరీరంలో ఆజ్ఞాతంగా గడపటం అనేవి తెలియనివి.
ఔర్వుడు భృగు వంశంవాడు. భృగు వంశీకులు కృతవీర్యుడనే రాజు వద్ద యాజకత్వం చేసి ధనం సంపాదించారు. కృతవీర్యుడు చనిపోయిన తరువాత, కోశాగారంలో ధనం లేకపోవడం వల్ల, కృతవీర్యుని కొడుకులు, భృగువంశం వారు తమ ధనాన్నంతా దోచేశారని, ధనం రాజ్యానికి అప్పగించాలని ప్రకటించారు. దీనితో, కొందరు తిరిగి ఇచ్చివేసారు. కొందరు భయపడి పారిపోయారు. కొందరు తెలియని ప్రదేశంలో భూమిలో పాతిపెట్టారు. ఇది గ్రహించిన కృతవీర్యుని కొడుకులు, రాజద్రోహం క్రింద, భృగువంశీయులను, దొరకినవాణ్ణి దొరికినట్లు వధించడం మొదలుపెట్టారు. గర్భిణీ స్త్రీలను కూడా వదలిపెట్టలేదు. ఈ విషయం తెలుసుకొన్న భృగుపత్ని, గర్భస్థ పిండాన్ని తొడలో దాచిపెట్టింది. నూరేళ్ళు నిండిన తరువాత కొడుకును కన్నది. ఆ కొడుకే, ఊరువు నుండి పుట్టాడు కనుక ఔర్వుడయ్యాడు. ఊరువు అంటే తొడ.
ఇక, సూర్యుడు సురభి అనే ధేనువు శరీరంలో ఆజ్ఞాతంగా గడిపాడన్న కథ. ఈ కథను డా.జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారు క్రింది విధంగా వ్యాఖ్యానించారని పెద్దలు చెప్పారు. చూద్దాం యేమిటో ఆ కథ.
విశ్వకర్మ దేవశిల్పి. అతడు తన తపోబలంతో, యజ్ఞార్థంగా, మోక్షార్థంగా, అమృతమయమూర్తిగాను, కామరూపిణిగాను ఒక కన్యను సృష్టించాడు. ఆ కన్య పేరు సురభి. అదేవిధంగా, విశ్వకర్మ తేజోమయుడైన ఒక పురుషుని కూడా సృష్టించాడు. అతడు సురభిని చూసి కామమోహితుడై ఆర్తిని పొందాడు. అది తెలుసుకొన్న విశ్వకర్మ " మా ఆర్తఃభవ " అని అతని ఆర్తిని పోగొట్టి కన్యను సమర్పించాడు. అందువల్ల, ఆ పురుషునికి మార్తాండుడు అని పేరు వచ్చింది. సూర్యుడు ధేనువు శరీరమునందు కామమోహితుడవటాన్ని అజ్ఞాతచర్య సలపటం అని జొన్నలగడ్డవారు వ్యాఖ్యానించారట.
అజ్ఞాతవాసం చేయవలసి వస్తున్నందుకు మనోవ్యథ పడుతున్న ధర్మరాజును ఓదారుస్తూ, " కాలం కలసిరానప్పుడు మహానుభావులైనవారు కూడా అక్కడా ఇక్కడా తలదాచుకొని, అనుకూలమైన సమయం కోసం వేచివున్నారని, ధౌమ్యుడు యీ కథలను ప్రస్తావించాడు.
No comments:
Post a Comment