హితమును ధర్మముం దలచి యిమ్మెయి జెప్పితి రిట్లు మున్ను; నా
సుతుల నయంబుమై దఱిమి జూచితి; వారల బంపు సేయ నే
చతురుడ గాను; బ్రాభవము సాలదు; నా దెస దప్పు లేమి మీ
మతి దలపోసి యీ పలుకు మానుడు పాకము దప్పె గార్యముల్.
వ్యాసమహర్షి ధృతరాష్ట్రునితో పాండవుల రాజ్యం వారికివ్వమని, తన వంటి వారి మనస్సులకు ఇష్టం లేని యీ రాజ్యం ధృతరాష్ట్రుని కెందుకని, హితము, శాంతివచనాలు పలికాడు. అన్నీ విన్న ధృతరాష్ట్రుడు వ్యాసునితో యీ విధంగా చెప్పాడు.
" ఓ వ్యాసమహర్షీ! ఇంతకు ముందు కూడ మీరు నా మంచి కోరి హితము పలికారు. దానికి తగ్గట్లు, నేను కూడా వారికి బుద్ధి చెప్పాలని ఎంతో ప్రయత్నించాను. వారు నా అదుపాజ్ఙల నుంచి దాటిపోయారు. వాళ్ళను కట్టడి చేసే సామర్థ్యం నాకు లేదు. నావైపు నుంచి తప్పు లేదని గ్రహించాలని ప్రార్థిస్తున్నాను. అందువల్ల, నాకు హితం చెప్పి లాభం లేదు. ఈ సమయంలో నేను చేయగలిగింది యేమీ లేదని మనవి చేస్తున్నాను. "
తిక్కన భారతము భీష్మపర్వం ప్రథమాశ్వాసంలోని యీ పద్యం చక్కని తెలుగు పదాలతో సరళంగా సాగి, కవిబ్రహ్మ రచనా రీతికి నిదర్శనంగా నిలుస్తుంది. సందర్భానికి తగ్గట్టు భాషను మలచడం తిక్కనకు వెన్నతో పెట్టిన విద్య. నిస్సహాయతతో, జాలిగొల్పే రీతిలో సాగిన ధృతరాష్ట్రుని మానసిక వ్యథను యీ పద్యంలో వాడిన ' యిమ్మెయి జెప్పితి రిట్లు మున్ను ', ' సుతుల నయంబుమై దఱిమి జూచితి ', ' వారల బంపు సేయ నే జతురుడగాను ' 'నా దెస తప్పు లేమి మతిం దలపోసి యీ పలుకు మానుడు ' వంటి తెలుగు పదబంధాలు ధృతరాష్ట్రుని నిస్సహాయతను ఒక వైపు చూపిస్తూ, శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా యదార్థ పరిస్థితుల పట్ల అతడు ప్రదర్శించే అంధత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ చక్కని, చిక్కని పదబంధాలు పద్యానికి అందాన్ని చేకూర్చాయి.
ముఖ్యంగా " పాకము దప్పె కార్యముల్ " అన్న పదబంధం ఎంతో అందమైనది, చిక్కనైనది. ఈ పదబంధము ధృతరాష్ట్రుని విచిత్రమైన పాత్రను సానుభూతితో అర్థం చేసుకొనడానికి ఉపయోగపడటం ఒక యెత్తుకాగా, అన్నీ తెలిసిన మూఢునిగా అతడిని విశ్లేషణ చేయడానికి తోడ్పడుతుంది.
ఈ పద్యానికి నాకు అర్థమైన రీతిలో నాలుగు మాటలు వ్రాయడానికి శ్రీ నండూరి రామకృష్ణాచార్యులుగారి విశేష వ్యాఖ్య ఆధారమని సవినయంగా మనవి చేస్తున్నాను.
No comments:
Post a Comment