ఆరంభరహితు బొందునె
యారయ సంపదలు? హీనుడయ్యును పురుషుం
డారంభశీలు డయి అకృ
తారంభుల నోర్చు నెట్టి నధికుల నయినన్.
కడు నధికుతోడ దొడరిన
బొడిచిన నొడిచినను బురుషు పురుషగుణం బే
ర్పడు గాక హీను నొడుచుట
కడిదియె? పౌరుషము దాన గలుగునె చెపుమా!
నన్నయ భారతం సభాపర్వం ప్రథమాశ్వాసంలోని యీ రెండు కందపద్యాలు ప్రయత్నశీలుర యొక్క, కార్యసాధకుల యొక్క లక్షణాన్ని సూచిస్తాయి.
ధర్మరాజు తన పితృదేవతల ప్రీత్యర్థం రాజసూయ యాగం చేయదలచాడు. దైవకృపకోసం, పరమాత్మయైన కృష్ణుడిని సగౌరవంగా ఇంద్రప్రస్థానికి రప్పించాడు. వారి మధ్య బలవంతుడైన జరాసంధుని నిర్జించవలసిన అవసరం గూర్చి చర్చ వచ్చినపుడు, అక్కడే ఉన్న భీముడు పలికిన మాటలివి.
" ఒక పని సానుకూలపడాలంటే ప్రయత్నం చేయాలి. పురుషప్రయత్నంతోనే సంపదలు సమకూరుతాయి. బలహీనుడయినా సరే, మనిషి ప్రయత్నం చేస్తే, ప్రయత్నం చేయని బలవంతుడిని జయించగలుగుతాడు. ఇవన్నీ అట్లావుంచి, బలవంతుడిని ఓడిస్తే గొప్ప గానీ, బలహీనుడిని గెలవడం యేమి పరాక్రమం అనిపించుకొంటుంది. "
ఈ పద్యంలో పురుషప్రయత్నం ఆవశ్యకతతో పాటు, అంతకుముందు కృష్ణుడు, జరాసంధుని శౌర్యపరాక్రమాలను గురించి మాట్లాడడం, భీమునిలో దాగియున్న శౌర్యాగ్నిని ప్రజ్వరిల్లజేయడానికే అనే విషయం సువిదితమౌతుంది.
No comments:
Post a Comment