గలుగు టెఱింగి యుపాయపూర్వము గడగి తత్సిద్ధి
యలయక యుత్సాహవంతుడు వడయు నట్లనుత్సాహ
మొలసి దైవపరు డిది వలయంగను నోపునె నెందు.
కడు నిమ్ముగా దున్ని బీజములు సల్లి కర్షకుం డున్న
దడయక వర్షంబు గురిసి కావించు దత్ఫలసిద్ధి
నడుమ బర్జన్యు డనుగ్రహింపనినా డేమి సేయు
గడగి చేయంగలవాని జేయును గాక కర్షకుడు.
మహాభారతంలో, ధర్మాధర్మ వివేచన, ధర్మసూక్ష్మ పరిశీలన, నిర్ణయం, పలుతావుల, పలు పాత్రల ద్వారా జరగడం మనం చూస్తాము. అరణ్యపర్వం ప్రథమాశ్వాసంలో, ద్రౌపది ధర్మరాజుల మధ్య నాస్తికత్వానికి, ఆస్తికత్వానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఆ సమయంలో, పురుషకారానికి దైవానుగ్రహానికి మధ్య నున్న సున్నితమైన విభజనరేఖ గూర్చి ద్రౌపది చక్కగా విశ్లేషిస్తుంది. ఈ విశ్లేషణను నన్నయగారు రెండు మధ్యాక్కరలలో పొదిగారు.
పురుషప్రయత్నము, దైవానుకూలత అనేవి లోకసామాన్యంగా వింటుంటాము. ఈ లోకవ్యవహారాన్నే ఉపమానాలతో విడమరచి చెబుతున్నది ద్రౌపది.
నువ్వుల్లో నూనె, కట్టెలో అగ్ని దాగి ఉన్నాయి. అట్లాగని, నువ్వులను పిండకుండా నూనె, కట్టెలను రాజేయకుండా అగ్ని బయటకు వస్తాయా? అందువలన, ఉపాయంతో ఫలితం సాధించాలనుకొనే ఉత్సాహవంతుడు పురుషప్రయత్నంతో కార్యఫలసిద్ధి పొందినట్లు, దేవుడా నీదే భారమని అలసత్వం చూపించే వాడు కార్యసాఫల్యాన్ని పొందలేడు. పొలాన్ని చక్కగా దున్ని, విత్తనాలు చల్లి, రైతు వర్షం కోసం ఎదురుచూడొచ్చుగానీ, ప్రయత్నమే చేయకుండా ఉండడం అవివేకం గదా! పురుషప్రయత్నం చేసి కూడా, దైవానుకూలత లేకపోతే, మనమేమీ చేయలేము. పురుషప్రయత్నం చేయవలసిదే. ఇదీ పురుషకారానికి, దైవానుకూలతకు మధ్య నున్న చక్కని, చిక్కని విభజనరేఖ.
No comments:
Post a Comment