గ్వచిదుద్భ్రాంత విహంగసంతతి, క్వచిత్కాశ ప్రసూనాచ్ఛయున్
గ్వచితానీత తుషార శీతల, క్వచిత్కమ్ర స్వరవ్యాప్తయున్
గ్వచిదాకాశ విశాల భావకృతదృక్తాత్పర్య కృష్టాత్మయున్
ఇది విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము లోని గంగానది వర్ణన. ఈ పద్యములో కవిసమ్రాట్టులు గంగానది నడకలను, హొయలను, సజీవ శబ్దచిత్రాలుగా మలిచారు. సత్యనారాయణ గారి రచన కూడా గంగానది నడక వలె పలురీతులలో సాగి, పాఠకుల ఊహకు బెత్తెడు దూరంలో ఉంటుంది. అట్టి శబ్దచిత్రాల అందాలను చదివిన ప్రతిసారీ ఊహించవలసినదే గానీ, సంపూర్ణముగా వివరించడము సాధ్యము కాదు. ఎందువలనననగా, అది అనుభూతి విశేషము కనుక. విశ్వనాథవారి గతజనుస్సుల చెలిమికాడుగా అభివర్ణింపబడిన శ్రీ జువ్వాడి గౌతమరావు గారు తమ 'రామాయణ కల్పవృక్షచ్ఛాయ ' అనే వ్యాసములో ఈ పద్యములో నిక్షిప్తము చేయబడిన గంగానది నడకలను, అద్భుతముగా దర్శింపజేశారు. దానిని, నా మాటలలో మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను.
గంగానది కొన్నిచోట్ల పచ్చని బంగారము కుప్పలు పోసినట్లు ఉంటుంది. జనసంచారము లేని గాంగానదీ తీరం వెంబడినున్న ఇసుకతిన్నెలు యీ దృశ్యాన్ని తలపిస్తాయి. ఇక కొన్నిచోట్ల, గంగానది చాలా గంభీరంగా ఉండి సముద్రాన్ని తలపిస్తుంది. అటువంటి చోట, నది లోతును ఊహించడం కష్టం. మరికొన్ని చోట్ల, నది విశాలమైన సమతల ప్రదేశంలో ప్రవహిస్తుండగా, బారులుగా మీద తిరుగాడే పక్షి సంతతి, వాటి కూతలు ఊహించవలసినదే గానీ, మాటలకు అందవు. కొన్నిచోట్ల, తీరం వెంబడి పెరిగిన తెల్లని రెల్లుచెట్లు సన్నని పిల్లగాలికి కదలాడుతుంటే, మాయాబజారు చలనచిత్రము లోని "లాహిరి లాహిరి లాహిరిలో, ఓహో జగమే ఊగెనుగా" పాట చిత్రీకరణను స్మృతిపథంలోకి తేవూ? జలపాతము దగ్గర నిల్చొని జలపాతం అందాలను తిలకిస్తున్నప్పుడు, చల్లని మంచు తుంపరలు శరీరానికి ఏ సౌఖ్యానుభూతి కలిగిస్తుందో, అటువంటి సౌఖ్యానుభూతినే కలిగిస్తుంది గంగానది కొన్నిచోట్ల. ఒక చేతిని వీణ తంత్రుల మీద నుంచి, మరియొక చేతి వ్రేలితో వీణ మెట్లను నొక్కి లాగితే, పుట్టిన ధ్వని గుండె లోతుల లోనికి చొచ్చుకొనిపోయి, ఎటువంటి ఆనందాన్ని కలిగిస్తుందో, అటువంటి అనుభూతిని కలిగిస్తుంది గంగానది కొన్నిచోట్ల. ఇక చివరి పాదములోని " క్వచితాకాశ విశాల భావకృత దృక్తాత్పర్య కృష్టాత్మయున్". దీనిని గూర్చి జువ్వాడి వారు వ్యాఖ్యానించవలసినదే గానీ, ఇంకొక మార్గమున గాదు.
" దీని యర్థమును భావింప వలసినదే గానీ చెప్పుట కష్టము. చెప్పుట పదబంధము కాఠిన్యము వలన కాదు. పదబంధము కాఠిన్యమును నిముసములో ఛేదింపవచ్చును. కానీ, ఒక గూఢమయిన, ప్రౌఢమయిన భావమును పట్టుకొనుట కష్టము. నదీ వైశాల్యమెక్కువగా నున్నచోట, ఆవలి యొడ్డును ఆకాశము చుంబించుచుండగా, యీ నడిమి వైశాల్యమును భావింప గలిగినచో, కొంత యీ కల్పవృక్ష కవితావైశాల్యమును భావించినట్లగు ననుకొనుచున్నాను."
ఇట్టి వ్యాఖ్యానము నందించిన జువ్వాడి గౌతమరావు గారికి నమస్సుమాంజలులు.
ఇక్కడొక చిన్న మాట. కాశీ, ప్రయాగ క్షేత్ర సందర్శన సమయమున, గంగాయమునలు తమ అందములచే అలరించినది నిక్కువమే గానీ, విశ్వనాథవారి గంగానది వర్ణన అవాచ్యమధురమైనదనుటలో సందేహము లేదు.
No comments:
Post a Comment