కార్యార్థిం గలిపించి చెప్పుదు ననంగా గాదు, మున్నెప్పుడో
భార్యాయుక్తముగాగ నిన్ బరిచరింపం గన్నయట్లొప్పెడున్
మర్యాదాప్రియమైన నాయెడద హంసా ! యెప్పుడేనీ హిమా
హార్యప్రాంతమునుండి యేగుచు నయోధ్యాప్రాంతమందాగితే !
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధకాండము, సంశయ ఖండం లోని ఈ పద్యం చదువుతుంటే భవదీయుని మనస్సులో ఎన్నో భావాలు పెనవేసుకుపోతున్నాయి.
రాముడు మర్యాదాప్రియుడు. అంతటి మర్యాదాప్రియత్త్వంతో కూడుకొని ఉంది యీ పద్యం. సాగరతరంగాల మీద నుండి మెల్లగా వచ్చి తన సమ్ముఖంలో అటూఇటూ తిరుగుతున్న రాజహంసను చూడగానే, తన విరహవేదనను జానకికి తెలియజేయడానికి పరమశివుడే యీ రూపంలో వచ్చాడని రామునికి అనిపించింది. ఆ రాజహంసతో ఇట్లా అంటున్నాడు:
" ఓ హంసా ! నేను కార్యార్థిని. నీతో పని బడిన వాడిని. అందుకని ఏదో కావించుకొని చెప్పానని అనుకోవద్దు. ఇంతకు ముందెప్పుడో, నీ భార్యతో పాటుగా నిన్ను చూసినట్లుగా అనిపిస్తున్నది. నువ్వెప్పుడైనా హిమవత్పర్వతప్రాంతం నుండి బయలుదేరి మధ్యలో అయోధ్యలో కొంచెంసేపు ఆగావా? "
ఇందాక చెప్పానే మర్యాదాప్రియత్వం. పద్యం నడక చూస్తే, ఆకాశమార్గంలో ఉమామహేశ్వరులు సంచారం చేస్తూ అయోధ్యాపట్టణ ప్రాంతంలో దర్శనమిచ్చినట్లుగా పాఠకులకు అనుభూతి కలిగిస్తున్నది. ఈ పద్యంలోని అందమంతా, ' భార్యాయుక్తముగాగ ', ' హిమాహార్యప్రాంతము నుండి ' అన్న ప్రాణభూతమైన పదబంధాలలో ఉంది. పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమైన అనుభూతికన్నా, భావనారూపంలో హృదయకుహరంలో దోబూచులాడుతుండటం ఎక్కువ అనుభూతిని మిగులుస్తున్నది.
అతిశయోక్తి అని అనుకోకపోతే ఒక విషయం చెప్పాలని ఉంది. విశ్వనాథవారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము చదువుతున్నప్పుడు, ఏ పద్యమూ వదిలిపెట్ట బుద్ధి కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభూతి మిగులిస్తుంది. కవిత్రయభారతం, రామాయణ కల్పవృక్షం చదవనివాడు తెలుగువాడు కాదన్న శ్రీ వనమా వేంకటరమణగుప్త గారి మాటలు అక్షరసత్యాలు.
No comments:
Post a Comment