ఆత్మజుడన్న తీయదనం బెఱుంగని చిత్తంబు ఱారూపు చేదుకట్టె
ప్రియసుతుడన్న జాబిల్లి జూడని కన్ను లవి యప్రసన్నతాంధ్వంపు గూండ్లు
కొడుకన్న చిన్నారి పడవ చేరని వాని బ్రతుకు ఝంఝామరుత్ప్రళయవీధి
కొమరుడన్ పుణ్యకర్మము గాంచనేరని కట్టడి పున్నరకంపు ద్రోవ
తనయు డన్న సూక్ష్మతత్త్వం బెఱుంగని
జీవి మాయలోన జిక్కుకొన్న
యనదపుర్వు వాని కైహికాముష్మికం
బులు నశించు దారి వెలుగులేక.
ఆత్మజుడు అంటే కన్నకొడుకు. కన్నకొడుకు అనే మాధుర్యాన్ని చవిచూడని మనస్సు కటికచేదుగా ఉండే కట్టెలాంటిది. హాయిని గూర్చే కొడుకును చూడని కళ్ళు, అవి ప్రసన్నత లేని చీకటి గూళ్ళు. కొడుకు అనే చిన్న పడవను చేరని జీవితం తీవ్రమైన గాలితో విరుచుకుపడే ప్రళయం లాంటిది. కుమారుడు అనే పుణ్యఫలాన్ని పొందలేని అవరోధం, పున్నామనరకానికి దారిలాంటిది. తనయుడు అనే సూక్ష్మతత్త్వం తెలియని జీవి, మాయలో చిక్కుకొన్న అల్పప్రాణి, అనాథ లాంటివాడు. అటువంటివాడు ఇహలోక పరలోక సుఖాలు రెంటికీ దూరమై, దారీతెన్నూ లేనివాడవుతాడు.
ఇంత హృదయక్షోభను అనుభవిస్తున్నది దశరథుడు. దశరథుని పుత్రేచ్ఛను గురించి, అది తీవ్రమైన వేదనగా మారిన తీరును గురించి ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారేమన్నారో చూడండి.
" కల్పవృక్షంలో బాలకాండ రామకథా తరువుకు బీజంలాంటిది. కావ్యకథాప్రవృత్తికి బీజభూతాలైన కథార్థాలనందులో సంతరించడం శిల్పం. నాటకంలో ముఖసంధినిర్వహణ మెంత ముఖ్యమో కావ్యంలో ఆదిపర్వనిర్వహణం అంత ప్రధానం. కల్పవృక్షం లోని బాలకాండ భావి కథా విస్తృతికి వ్యంగ్యసామాగ్రి నిక్షేపించిన అర్థకోశం. బాలకాండలో ప్రధాన ప్రతిపాద్యాంశాలు నాలుగు. 1. రామ జననం. 2. రామ సంస్కారం. 3. రామ పరాక్రమం. 4. సీతారాముల ప్రణయం.
కుమార జననానికి తల్లిదండ్రుల ఇచ్ఛాశక్తి మూలం. దశరథుని పుత్రేచ్ఛ భార్యల కన్నుల లోని విషాదరేఖలను చూచి వేదనగా మారుతుంది. ప్రకృతిలో సంతానసౌఖ్యం స్ఫురించే సన్నివేశాలన్నీ అతని ఆకర్షించాయి. ఆ హాయిలో నుంచే ఆవేదన రగులుకొంటుంది. "
దశరథుడు రథం మీద అయోధ్యావీధుల్లో వెళ్తున్నప్పుడు, ఏ వర్ణానికి చెందిన పిల్లవాడు కనిపించినా, కాసేపు అక్కడే నిలబడి కళ్ళింతవి చేసుకొని చూస్తాడు, చిరునవ్వు చిందిస్తాడు, ప్రేమగా దగ్గరికి తీసుకొని ఎత్తుకొంటాడు, ఏవైనా తినుబండారాలు తెప్పిస్తాడు, బుగ్గలు పుణుకుతాడు, చివరకు తన స్థితిని తలచుకొని వేడి నిట్టూర్పులు విడుస్తాడు.
సంతానహీనుల దురదృష్టాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించిన ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, ఇష్టిఖండంలో ఉంది.
No comments:
Post a Comment