తేజితబాణహస్తు, దృఢదీర్ఘమలీమసదేహు, గృ
ష్ణాజినవస్త్రు, నస్త్రవిషయాస్తవిషాదు నిషాదు జూచి యా
రాజకుమారు లందఱు బరస్పరవక్త్రవిలోకనక్రియా
వ్యాజమునం దదీక్షణనివారితు లై రతిమత్సరంబునన్.
మంచి పద్యం. చదవగానే, కంఠస్థం చేసి స్వంతం చేసుకోవాలనుకొనే పద్యం.
బాగా పదును పెట్టిన బాణం పట్టుకున్నాడట. శరీరం గట్టిగా, పొడుగ్గా, మురికి పట్టి నల్లగా ఉందట. జింకచర్మం కట్టుకున్నాడట. అస్త్రవిద్య విషయంలో దుఃఖం లేకుండా ఉన్నాడట. ఇంతకీ ఎవరితను? ఎరుకవాడు. రాజకుమారులందరూ అతడిని చూసి కూడా, ఈర్ష్య చేత చూడలేక, ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట. ఇదీ నన్నయగారు ఏకలవ్యుడిని గురించి వ్రాసిన పద్యం.
ఈ ఏకలవ్యుడు హిరణ్యధన్వుడు అనే ఎఱుకలరాజు కొడుకు. ద్రోణాచార్యుని శిష్యుడనని తానే చెప్పుకోవటం వల్ల, రాజకుమారులకు ఈర్ష్య కలిగిందని తరువాత కందపద్యం చదివితే తెలుస్తుంది.
నన్నయగారి రచనాశైలిలో అక్షరరమ్యతకు ఇది చక్కని ఉదాహరణ. స్థిర చిత్రాలను, వ్యక్తులను వర్ణించడంలో నన్నయగారు అందెవేసిన చేయి.
ఇంతటి అందమైన పద్యం నన్నయ భారతము, ఆదిపర్వము, పంచమాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment