అన విని భూవిభుండు ప్రియమారగ గర్ణుని జూచి ' దేవకీ
తనయుడు మద్రనాథునకు దక్కువ మాతలియుం దలంప నీ
తని కెనరాడు భాగ్యము కతంబున సారథియయ్యె నీకు నీ
యన గొని నీవు పార్థునియహంకృతి మాన్పుము ధీరమానసా!
మనసుపెట్టి చదవాలే గాని, తిక్కనగారి ఏ పద్యం వదలబుద్ధవుతుంది? అటువంటి అందమైన పద్యమే శ్రీమదాంధ్ర మహాభారతము, కర్ణపర్వం, ప్రథామాశ్వాసంలోని యీ పద్యం.
శల్యుణ్ణి కర్ణుడి రథానికి సారథ్యం వహించమనటం ఒక సాహసం. ఆ సాహసం చేసి సఫలీకృతుడయ్యాడు దుర్యోధనుడు. శల్యుడు అంగీకరిస్తూనే ఒక చిన్న మెలిక పెట్టాడు. అదేమిటంటే, అతడు రథాన్ని నడుపుతూ, యుక్తమయినవీ, ఉచితమైనవీ అయిన మాటలు చెబుతానన్నాడు. అంతేకాదు, అందులో ఒక్కొక్కప్పుడు నింద, ప్రశంస కూడా ఉండవచ్చనీ, అందువల్ల, అవి కర్ణుడి ఆలోచనకు విరుద్ధంగా ఉన్నా, వివేకంతో వాటిని సహించాలన్నాడు.
ఇక్కడే ఉంది కిటుకు. మద్రదేశానికి రాజైన శల్యుడు సహజంగానే పాండవ పక్షపాతి. అయితే పొగడ్తలకు పొంగిపోయే స్వభావమున్న శల్యుడు, అటు ధర్మరాజుకి, ఇటు దుర్యోధనుడికి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు కౌరవుల పక్షాన పోరాడుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, కర్ణరథ సారథ్యానికి ఒప్పుకున్నప్పటికీ, దుర్యోధనునికి అతని మీద అనుమానమే. అందునా షరతు కూడా పెట్టాడు. కర్ణుడి తీరూ అంతే. అతని ఆత్మాభిమానం, దర్పం అతనిది. శల్యుడి సూటిపోటి మాటలకు తట్టుకుంటాడా అన్న అనుమానం దుర్యోధనుడికి ఉంది. అందుకనే, దుర్యోధనుడు శల్యుడి దగ్గర, కర్ణుడి దగ్గర ఎంతో చాకచక్యంగా, తగ్గి మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు శల్యుడి షరతు విన్న తరువాత, కర్ణుడి మనస్సుకి ఉపశమనంగా, ప్రేమతో ఇట్లా అంటున్నాడు.
"కర్ణా! ఈ శల్యుడు రథాన్ని నడపటంలో కృష్ణునికేమీ తీసిపోడు. ఒకరకంగా చూస్తే, మాతలి కూడా ఈయన ముందు పనికిరాడు. నీ అదృష్టం వల్ల నీకు దొరికాడు. అందువల్ల ఇతడిని సారధిగా చేసుకొని అర్జునుడి పొగరు అణగకొట్టు. "
మాతలి ఇంద్రుని రథసారథి.
ఈ సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానంవారి శ్రీమదాంధ్ర మహాభారతము, కర్ణపర్వం, ప్రథమాశ్వాసానికి, శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్యగారు వ్రాసిన విశేష వ్యాఖ్య ఇక్కడ పొందుపరచటం సముచితంగా ఉంటుంది.
" దుర్యోధనుడిది గొప్ప దౌర్భాగ్యం - ఎవడికి వాడే విడివిడిగా లోకాన్ని లొంగదీయగలవాళ్ళు అతడికి తోడుగా నిల్చారు. కానీ అది అంతా అతడి మీది అనురాగంతో కాదు - వివిధ కారణాల వలన, ఇష్టానిష్ట మనస్సులతో ! ఈ మహావీరులలో చాలామందికి ఒకరంటే మరొకరికి పడదు. తప్పనిసరై పరస్పరం, తోడ్పడవలసివచ్చినా, ఎవడి దర్పం వాడు వదలడు. ఇట్లా మునిగిపోయింది దుర్యోధనుడి పుట్టి. దుర్యోధను డెన్ని తిప్పలు పడినా, శల్యుడి మనస్సు పూర్తిగా మారదు. శల్యుడి సాయం తానే కోరినా, కర్ణుడి దర్పం కర్ణుడిది. అందులోనూ శల్యుడి మాటలలో ఆ వగరు కనిపిస్తే, అది పైకి రాకమానదు. అదంతా ఈ ఇద్దరి మాటలలోనూ కనిపిస్తుంది. దుర్యోధనుడు కార్యసాధనకొరకు ఎంతో తగ్గి మాట్లాడుతున్నాడు. శల్యుడు కావాలని ఆదినుండీ అతని వెనుక గొయ్యి త్రవ్వుతూనే ఉన్నాడు. "
చివరగా, ' ధీరమానసా! ' అన్న సంబోధన కూడా, " శల్యుడి సంగతి నీకు తెలియని దేముంది, మనసు దిటవు చేసుకో ! " అన్నట్లుగా ఉంది.
No comments:
Post a Comment