అలఘు గుణంబులం దధికుడైన మహాత్ముడు రాగకోపమా
యలబడి, అక్షమా వివశుడై, అచిరాంశులతావిలాసచం
చలమగు లక్ష్మి కాస పడి, సత్యము ధర్మువు దప్పి సత్సభా
వలి దగువారియొద్ద దగువాడయి సద్విధి నుండ నేర్చునే?
ఈ పద్యానికి నేపథ్యం, ధర్మరాజుతో, తక్కిన నలుగురు అన్నదమ్ములు, ద్రౌపది, వారందరూ పడుతున్న కష్టాలను గూర్చి జరిపిన సంభాషణ.
వనవాసంలో ఉన్న పాండవులు తాము పడుతున్న కష్టాలను గురించి మాట్లాడుకోసాగారు. భీముడు, ధర్మరాజు యొక్క ధర్మబుద్ధి, అతి మంచితనం పనికిరావన్నాడు. దానికి ధర్మనందనుని సమాధానమే శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వము , ప్రథమాశ్వాసము నందలి యీ పద్యం.
రాగమంటే విపరీతమైన అభిమానం. దీన్నే, మోహమని కూడా అనుకోవచ్చు. కోపం సంగతి తెలిసిందే. అది మనిషిని తను ఉండాల్సిన హద్దుల్ని దాటిస్తుంది. ఇక మాయ అంటే, ఏది నిజమో దాన్ని అబద్ధమనుకోవడం, ఏది అబద్ధమో దాన్ని నిజమనుకోవడం. మనం, ఈ అభిమానం, కోపం, మాయ అనేవాటిలో చిక్కుకుపోయి, క్షమాగుణాన్ని మరచిపోయి, అసహనానికి లోనవుతుంటాము. మేఘం లోని మెరుపు యెంత అస్థిరమో, చంచలమో, సంపదలు కూడా అంత అస్థిరము, నిలకడలేనివి. కానీ, మనం సంపదలు అనే లక్ష్మీవిలాసానికి ఆశ పడతాము. ఈ కారణంగా, సత్యము, ధర్మము అనే దారి నుండి ప్రక్కకు తప్పుకుంటాము. ఎప్పుడైతే సత్యం, ధర్మం మన హృదయం నుండి దూరమవుతాయో, అప్పుడు సజ్జనుల వద్ద, యోగ్యుల వద్ద యెట్లా మెలగాలో తెలియదు.
ఎవడు అరిషడ్వర్గాలను గెలిచి, ఈషణత్రయాన్ని విడిచి, సత్యము, ధర్మము అనే మార్గంలో నడుస్తాడో, వాడే మహాత్ముడు. అటువంటి మహాత్ముల త్రోవ బోక, సజ్జనుల వద్ద భంగపాటు పడడం తగునా అని ధర్మరాజు వితర్కించుకున్నాడు.
అందుకే యుధిష్ఠురుడు అనే జన్మ నామం గల యీ మహాత్ముడు, ధర్మరాజుగా ప్రసిద్ధి నొందాడు.
No comments:
Post a Comment