వారికి ధీరులకు ధరణీవల్లభులకు వా
క్పారుష్యము చన్నె? మహా
దారుణ మది విషము కంటె దహనము కంటెన్.
ధర్మరాజు వైభవోపేతంగా రాజసూయ యాగం చేస్తున్నాడు. కురువృద్ధుడైన భీష్ముడు భగవంతుడైన శ్రీకృష్ణుడే అగ్రపూజార్హుడని నిర్ణయించాడు. భీష్మపితామహుని మాటలను విన్న ధర్మరాజు, సహదేవుడు తెచ్చిన అర్ఘ్యాన్ని శాస్త్రోక్త విధానంలో శ్రీకృష్ణునికి సమర్పించాడు. అది చూసి సహింపలేని శిశుపాలుడు కృష్ణుడిని పలు నిందావాక్యాలతో దూషించాడు. ఆ సమయంలో, శిశుపాలుని వెనుకనే వెళ్ళి అతనిని బుజ్జగిస్తూ ధర్మరాజు చెప్పిన మాటలివి.
" గొప్ప గుణాల చేత పేరెన్నిక గన్నవారికి, బుద్ధివిశేషం కలిగినవారికి, ప్రజారంజకులైన ప్రభువులకు, మాట మాట్లాడటంలో కరుకుదనం ఉండవచ్చునా? మాట కరుకుదనం విషం కన్నా, అగ్ని కన్నా అతి భయంకరమైనది. "
ఇక ఈ పద్యానికి తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము , సభాపర్వము, ద్వితీయాశ్వాసమునకు, డాక్టరు అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు సమకూర్చిన విశేష వ్యాఖ్యను, పాఠకుల సౌలభ్యం కోసం యధతథంగా ఇక్కడ పొందుపరచటం ఎంతైనా సముచితంగా ఉంటుంది.
" నన్నయసూక్తుల్లో ఇదొక సుప్రసిద్ధసూక్తి. నన్నయ రుచిరార్థ సూక్తినిధి. అంటే అనేక రుచిరాలైన అర్థాలతో కూడుకొన్న సూక్తులకు ఆయన నిధివంటివాడు. సూక్తి అంటే మంచి మాట. లోకాన్ని పరిశీలించి, అనుభవాన్ని ఆధారంగా గొని, ధర్మమార్గానికి దీపికగా, మానవుని మనస్సుకు ఎక్కేట్లు చెప్పే మంచిమాట సూక్తి. సూక్తి సుదీర్ఘంగా ఉండకూడదు. సూత్రప్రాయంగా ఉంటేనే సూక్తికి శోభ. అంటే అది అల్పాక్షరాల అనల్పార్థ రచన. అంతేకాదు, సూక్తిలోని అర్థం సూటిగా ఉండాలి. కొంత ఘాటుగా కూడ ఉండాలి. అది చదివేకొలది చవులూరించాలి. వ్యక్తి జీవితానికి వెలుగునివ్వాలి. కవి లోకహితుడు. అతని కవిత రసమయంగానే కాక, ఉపదేశయుతంగా ఉండాలి. ' జగద్ధితంబుగన్ మహాభారత సంహితారచన బంధురు ' డైన మహాకవి నన్నయ నానా రుచిరార్థ సూక్తినిధి. రసమయమైన ఆయన కవిత సూక్తిరత్నాకరం. మానవజీవితంలో మాట ఎంతో విలువైంది. అది మానవుణ్ణి " మహాత్మా " అనిపించగలదు. " పశువా " అని పిలిపించగలదు. మాటకాఠిన్యాన్ని గూర్చి మహాకవి నన్నయసూక్తి మరపురానిది; మరువగూడనిది. "
ఇక ఇంత మంచిమాట ఏ కావ్యంలో ఉంటుంది, మహాభారతంలో తప్ప. మహాభారతం విశ్వవిజ్ఞానకోశమనే అంశాన్ని ధ్వనిస్తూ వ్యాసమహర్షి " యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్ ( ఇందు లేని విషయమెందును లేదు; ఎందును లేని విషయమిందుండును.) " అని అన్నారు. దీనినే నన్నయగారు, " ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, యధ్యాత్మవిదులు వేదాంతమనియు/ నీతివిచక్షుణుల్ నీతిశాస్త్రంబని/ కవివృషభులు మహాకావ్యమనియు...........విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై / పరగుచుండ జేసె భారతంబు. " అన్నారు.
No comments:
Post a Comment