ఇక్షుశరాసుడున్ మధువు నిద్దరు జంటగ వచ్చిరో శమీ
వృక్షగతాగ్నికిన్ విచలితేంధన వహ్నికి రెంటి మధ్య బ్ర
త్యక్షపరోక్ష భావ విదితంబగునట్టి యుషర్బుధాకృతుల్
దక్షులు మీర లెవ్వరు ప్రదక్షిణయోగ్యు లుదాత్తతేజసుల్.
పంపాతీరంలో సీతను అన్వేషిస్తూ , కిష్కింధ ప్రాంతానికి ధనుర్ధారులై వచ్చిన రామలక్ష్మణులను చూసి, ఋష్యమూక పర్వతము మీద తలదాచుకుంటున్న సుగ్రీవుడు భయభ్రాంతుడయ్యాడు. విషయం తెలుసుకొని రమ్మని హనుమంతుణ్ణి వారి వద్దకు పంపించాడు. వారి ఆకార విశేషాలు, ముఖదీప్తి, మాటతీరు చూసిన హనుమంతుడు వారితో యీ విధంగా అన్నాడు.
" మీ ఇద్దరిని చూస్తే, మన్మథుడు, వసంతుడు కలిసి వచ్చారా అన్నట్లు ఉన్నారు. యజ్ఞార్థం ఉపయోగించే సమిధలలో దాగి ఉన్నటువంటి, ఇంధనము ద్వారా జ్వలించేటటువంటి అగ్నిరూపమైన తేజస్సు, ప్రత్యక్ష పరోక్ష భావనలకు సంకేతంగా మీ ముఖంలో ద్యోతకమౌతూ, మీరు నాకు అగ్నిస్వరూపులుగా కనపడుతున్నారు. మీలో దక్షత స్పష్టంగా కనిపిస్తున్నది. ఉదాత్తత, తేజస్సు కలగలిసిన మీరెవరు? మిమ్మల్ని చూస్తే మీకు ప్రదక్షిణం చేయాలనిపిస్తున్నది. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము కిష్కింధాకాండము నూపురఖండములోని యీ పద్యం, హనుమంతుని యొక్క తూచి తూచి మాట్లాడే మాట తీరుని , బుద్ధి కుశలతను, కార్యదక్షతను సూచిస్తున్నది.
No comments:
Post a Comment