మారుతాహతి రాలు నారీకేళ ఫలాళి
నిడిసి జల్లించు పుండ్రేక్షురసము
చిలుకపోటులచేత జిరిగిన సహకార
ఫలముల దొరగెడి పచ్చితేనె
చిక్రోడ దంష్ట్రలు చెక్కు సుగంధి య
నటి పండ్లను గారు నవ్య సుధయు
బాక వేగారంభపరిపాటి దమయంత
పగిలిన పనస గొబ్బండ్ల బేస
మేకమై కాలువలు గట్టి యేకహేల
బరవ నందలి క్రియ్యూట పసిమితేట
బండు నవ్వీట ముక్కారు బసిడిగారు
సరస ధాన్యంబు మంచి రాజనపు జేలు.
తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ఒక అనర్ఘరత్నం. అందులో, ప్రథమాశ్వాసము నందలి యీ పద్యం చదివితే, పూర్వ మహాకవుల ప్రకృతి పరిశీలన యెంత నిశితంగా ఉండేదో అర్థమవుతుంది.
పూర్వం వ్యవసాయం మీద ఆధారపడ్డ సమాజం. పచ్చటి పొలాలు, పండ్లతోటలు, పశువుల మందలతో, పల్లెటూళ్ళు నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉండేవి. ఇప్పుడు వృద్ధాప్యంలోకి జారిన వారికి చాలామందికి మన పల్లెటూళ్ళ సౌభాగ్యం తెలుసు. ఈ పద్యం, ఆ మధురస్మృతులను మరొకసారి గుర్తుచేస్తుంది.
చేలగట్ల మీద కొబ్బరిచెట్లు , మామిడిచెట్లు , అరటిచెట్లు , పనసచెట్లు వరుసగా వేస్తారు. మధ్యలో చేనులో వరి గాని, చెఱుకు గాని, ఇంకా ఏదైనా పంట గాని వేస్తారు. గాలికి కొబ్బరిబొండాలు రాలి చెఱకుగడల మీద పడి, అవి చీలిపోయినాయట. చీలిన చెఱకుగడల్లోంచి చక్కని రసం కారి చేలో పారుతున్నదట. చేలగట్ల మీద కొబ్బరిచెట్ల వరుస, చేలో చెఱకుపంట - ఇంత వరకు ప్రకృతి పరిశీలన. ఆ పైన చెప్పినదంతా కల్పన. సహజమనిపించే మధుర చమత్కృతి.
సహకార ఫలము లంటే మామిడిపండ్లు. చిలుకలు కొట్టిన మామిడిపండ్ల నుంచి కారిన తీయని రసం. చిలుక కొట్టిన మామిడిపండు ఇంకా ఎక్కువ తియ్యగా ఉంటుందంటారు. ఇక్కడ, రామకృష్ణుడు పచ్చితేనె అన్నాడు. అదే ఆ కవి ప్రత్యేకత,
సుగంధి అరటిపళ్ళు. అదొక జాతి చక్కరకేళి లాగా. కమ్మని వాసన ఉంటుంది వాటికి. వాటిని ఉడుతలు పళ్ళతో చెక్కాయట. అప్పుడు వాట్నుంచి రసం కారుతున్నది.
పాకవేగారంభపరిపాటి అంటే మిగలబండినవి. పనసపండ్లు బాగా పండి వాటంతట అవే విచ్చిపోయినాయి. దానిలో నుంచి గుజ్జు (బేసము) కారుతోంది.
చెఱుకురసం, మామిడిపండ్ల పచ్చితేనె , సుగంధి అరటిపండ్ల నవ్య సుధ, పనస పండ్ల గుజ్జు - ఇవన్నీ చేలో పారుతున్నాయి. చేనంతా మధురసంతో ఇంకిపోయి, ముక్కారు ( మూడు కాలాల్లో పండే పంటలు) రాజనాలను పండిస్తున్నదట. రాజనాలనేవి ఆ రోజుల్లో పండే, సువాసన కలిగిన వరిధాన్యం. ఈ రాజనాల ప్రసక్తి ఆముక్తమాల్యదలో కూడా ఉంది.
ఎంత అందమైన పద్యం. ఒక్కసారి మన పల్లెటూళ్ళోకి, మన చేలల్లోకి, గట్లమీది చెట్లకి మనసును పరుగెత్తించలేదూ?
No comments:
Post a Comment