Friday 27 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 236 (శ్రీమదాంధ్ర మహాభారతము: శాంతిపర్వం: తృతీయాశ్వాసం)

ఇవి శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతిపర్వం, తృతీయాశ్వాసంలో భీష్మునిచే ధర్మరాజుకి చెప్పబడిన ఒక కథకు సంబంధించిన పద్యాలుపూర్వం, దీన్ని ముచుకుందుడనే రాజుకి రాక్షస గురువైన శుక్రాచార్యుడు చెప్పాడు.

ఒక బోయవాడు అడవిలో తిరుగుతూ, పక్షులను పట్టుకొని తింటూ, మిగిలిన వాటిని అమ్ముకుంటూ ఉన్నాడుఒకరోజు పెద్ద గాలివాన వచ్చిందివానలో తడిసి, చలికి వణికిపోతూ, వాడు ఒక చెట్టుకిందకు వచ్చాడుచెట్టు పైన గూట్లో ఉన్న ఒక పావురO, పెంటిపావురం ఆహారసంపాదన కోసం బయటకువెళ్ళి, తిరిగిరానందుకు చింతిస్తున్నది. చెట్టుక్రింద, బోయవాని వలలో చిక్కుకున్న ఆడపావురం పెనిమిటి మాటలను విని చాలా సంతోషించి, తన ఉనికిని తెలియజేసి, విధిని ఎవరూ తప్పించుకొన లేరని చెప్పింది.  

శరణము సొచ్చినం దగ బ్రసన్నత గైకొని రక్షణంబు సా
దరముగ జేయు టత్యధిక ధర్మముగా బుధకోటి సెప్పు; నీ
వరసి మహార్తు వీని శరణాగతు నోపినభంగి నాపదం
బొరయకయుండజేయుము ప్రభూతపు సీతున గొంకు వోయెడున్.

" ఆదుకొనమని ఆశ్రయించినవారికి సహాయం చేయడాన్ని మించిన ధర్మం ఏదీ లేదుఇది పెద్దలు చెప్పిన మాట. అందువల్ల, చలికి వణికిపోతున్న బోయవాడికి నీకు చేతనయినంత సహాయం చెయ్యి " అని శరణాగతి తత్త్వాన్ని బోధించింది.

అనవుడు నుల్ల మెంతయు బ్రియంబు వహింపగ బక్షివైరి " సీ
తున సకలాంగకంబులు బ్రతున్నము లయ్యెడు; దీని బాపవే! "
యని విహంగమంబు రయమారగ నచ్చటి పుల్లలెల్ల ము
క్కునగొని తెచ్చి ప్రోవిడి యకుంఠితమైన దయాగుణంబునన్.

(ప్రతున్నము లయ్యెడున్ = బాధ పెడుతున్నాయి; (దీనిని పల్లటూళ్ళలో సలపరించడం అంటారు)

అకుంఠితమైన = మొక్కవోనిదైన)

ఇది విన్న మగపావురంబోయవాడితో మానవభాషలో, అతడికి విధంగా సహాయపడగలదో, చెప్పమందిచలితో, తన అవయవాలన్నీ బాధకు గురవుతున్నాయని, కనుక బాధను పోగొట్టమని చెప్పాడు బోయవాడుఅప్పుడు గువ్వ, చిన్న చిన్న చితుకులను ముక్కున కరచుకొని వచ్చి ప్రోగుచేసింది. దగ్గరలో ఉన్న గ్రామంలోకి వెళ్ళి ఒకవైపున నిప్పుతో ఉన్న కర్రముక్కను తెచ్చి, చితుకులను వెలిగించిందిబోయవాడు, మంటకు దగ్గరగా కూర్చొని చలి కాచుకున్నాడు.

  తరువాత, వాడికి ఆకలిబాధ ఎక్కు వై, సంగతి, గువ్వకు తెలియజేశాడు. అప్పుడా గువ్వ:

ఖగములకు జీవనం బన గలదె సంగ్ర
హించి నట్టిది యాకలి కేమియైన
మాకు దొరకొన్నది దిందుము గాక! యైన 
నీవు డస్సితి వాతిథ్య నియతి వలయు 

" పక్షుల బతుకుల్లో, తిండి కూడబెట్టడమనేది ఉండదుఆకలికి ఏది దొరికితే అది తింటాంఅయినా, నువ్వు బాగా అలసిపోయావుఅతిథివైన నీ ఆకలి తప్పకుండా తీర్చాలి. " అన్నది.

ఇక్కడ ఒక సంగతి గ్రహించాలి. పక్షులు కానీ, జంతువులు కానీ, అహారం వెతుక్కుంటాయి గాని , కూడబెట్టవుమానవజాతి మాత్రమే అవసరానికి మించి ధనం, ఆస్తులు, కూడబెడుతుంది. ఇది శోచనీయం ఐశ్వర్యాలన్నీ అశాశ్వతాలనీ, నాటికైనా మరణం తప్పదనీ, తెలిసి తెలిసీ లెక్కకు మించి సంపదను  కూడబెడతాడుఅందుకనే, విశ్వనాథవారు మనిషిని " తెలిసిన మూఢుడు " అన్నది.

కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యగారు, భయం జంతు లక్షణమనీ, జంతువుల విషయంలో సాధు జంతువులు క్రూర జంతువులను చూసి మాత్రమే భయపడతాయనీ, కానీ మనిషికి ప్రతి విషయంలోను భయమనీ చెప్పారు. విషయం బాగా బుర్రకెక్కాలని, పుట్టంగానే పిల్లవాడికి లేకపోతే పిల్లకి ఏల్..సి. పాలసీ తిసుకొనేది యీ లోకంలో ఒక్క మనిషేనని, జంతువులకు ఏమీ పాలసీలు లేవని చమత్కారంగా చెప్పారు.

' కలదే యిమ్మెయి పౌరుషంబు జగతిం గారుణ్య మేపార ని
ప్పులుగి ట్లిచ్చునె మేను? నాదు చరితంబుల్ నిందకుం బట్టులై
తలపన్ వచ్చిన నింతనుండి కీడగునె యేతత్క్రూరతా ఘోర చే
ష్టలు మానం గలవాడ, బక్షి గురువై సంధించె సద్బోధమున్

బాగా ఆలోచించి, భార్య మాటలు గుర్తుకు తెచ్చుకొన్న పావురం, తనను బోయకు ఆహారంగా సమర్పించుకోవాలని నిర్ణయించుకొని, ఎదురుగా ఉన్న మంట చుట్టూ తిరిగి ఒక్కసారిగా అందులో పడిపోయిందిబోయవాడు, త్యాగనిరతికి నివ్వెరబోయాడు.  

" లోకంలో ఇటువంటి సాహసం, త్యాగం, ఉంటుందా? గువ్వ తన శరీరాన్ని నాకోసం అర్పించింది. ఛీ! ఛీ! నాది హీనమైన బతుకు. నా నడవడి వల్ల ఇంత చేటు వచ్చిందిఇక నేను ఇటువంటి నీచమైన పనులు చేయనుఆహా! పక్షి నాకు గురువై సన్మార్గాన్ని బోధించింది గదా! "  అనుకున్నాడు.

ఇది యిట్లాలిని బంధులం దొఱగి తా నీ యగ్నిలో గూలె నొ
ప్పిదమై యుండగ నిట్టి తెంప యెలయం బెంపారు వైరాగ్య సం
పద పాపంబుల నెల్ల ద్రుంపగ మహాప్రస్థానపుణ్యత్వ మొం
దెద నే నిప్పుడ ' యంచు మానసము శాంతిం బొంద నిర్మోహుడై.

" అంతేగాక, పావురం నా కోసం, తన భార్యను, బంధువులను వదలిపెట్టి, త్యాగబుద్ధితో అగ్నికి ఆహుతి అయిందిఇటువంటి సాహసం చేసి, వైరాగ్యభావంతో, నేను కూడా దేహత్యాగం చేసి, పుణ్యాత్ముడనవుతాను. " అని మమకారాన్ని వదిలి ఊరట చెందాడు.

భార్య తన కళ్ళముందే నిప్పులో పడటం చూసిన, ఆడపావురం కన్నీరుమున్నీరుగా విలపించిందితోడులేని జీవితం వ్యర్థమని తలచి, తాను కూడా నిప్పుల్లో పడి ప్రాణత్యాగం చేసింది విధంగా ప్రాణత్యాగం చేసిన పెంటి పావురం, దివ్యత్వాన్ని పొంది, దేవతాగణం మధ్యలో దివ్యాభరణాలతో వెలిగిపోతున్న, పెనిమిటిని చేరుకుంది.

ఇదంతా కళ్ళారా చూసిన బోయవాడు, దేహత్యాగం చేసి, పుణ్యలోకాలను పొందాలని, అడవిలో తిరుగసాగాడుఅతని ఒంటికి ముళ్ళు గుచ్చుకొని, రక్తం కారటం మొదలయ్యిందిఅట్లా అడవిలో వెళ్తున్న  బోయనికి ఎదురుగా కార్చిచ్చు కనపడిందిబోయవాడు చాలా సంతోషించి, దావాగ్నిలో పడి ప్రాణాలు వదిలాడుదేవతారూపం పొందాడు.

విధంగా శరణాగత రక్షణ ఫల విశేషాన్ని తెలిపే లుబ్ధకపోతాఖ్యానాన్ని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు.

లుబ్ధుడు అంటే బోయవాడు, కపోతము అంటే పావురము.










No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like