రమణుల్ ప్రొద్దుల మేలుకాంచి సఖులన్ రండంచు నాత్మీయ నా
మములం జీరి కుచద్వయీభరములన్ మధ్యంబు లల్లాడగా
బ్రమదోద్దామ గజేంద్రయాన లగుచుం బద్మాక్షునిం బాడుచున్
యమునాతీరము జేరబోయిరి గృహీతాన్యోన్య హస్తాబ్జలై.
శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమస్కంధము లోని ఈ పద్యం కాత్యాయనీ వ్రతాన్ని చేయడానికి ఉద్యుక్తులైన గోపికలను గురించి చెప్పినది.
గోపికలందరూ ప్రొద్దున్నే లేచి, స్నేహితురాళ్ళ ఇళ్ళకు వెళ్ళి, వారిని పేరు పేరునా " రండి, రండి " అని పిలుస్తూ, పాలిండ్ల బరువుతో నడుము అటూ ఇటూ ఊగుతుండగా, చాలా సంతోషంతో, మెల్లగా నడుస్తూ , కృష్ణుని పాటలు పాడుతూ, పొగుడుతూ, ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని, యమునానది తీరానికి చేరారు.
" ఆత్మీయ నామములం జీరి " అన్న పద సమూహాన్ని, " వారి వారి పేర్లతో పిలిచి అని, స్నేహితురాళ్ళను చాల ఆప్యాయంగా వారి ముద్దు పేర్లతో పిలిచి " అని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు.
ఇక " కుచద్వయీ భరమునన్ మధ్యంబు లల్లాడగా " అన్న పదాలు స్త్రీ యొక్క సహజ సౌందర్యాన్ని భాసింపజేస్తున్నాయి కానీ, అశ్లీలభావానికి ఏ మాత్రం చోటివ్వడం లేదు.
గజేంద్రయానం అంటే ఏనుగు నడక వంటి నడక. ఏనుగు నడక మెల్లగా, గంభీరం ఉంటుంది. ఆడవారి నడకను గజగమనంతోను, హంస నడకతోను పోల్చడం కవులకు పరిపాటి.
పోతనగారు " రమణుల్ " అన్న పదాన్ని సాభిప్రాయంగా వాడారు. గోపికలు నిరంతరం కృష్ణభావనలో రమిస్తూ ఉంటారు.
No comments:
Post a Comment