అతులబలుల్ పరస్పర జయార్థులు పార్థివపుంగవుల్ మరు
త్సుత మగథేశ్వరుల్ సమరశూరులు దారుణలీల బోరి రూ
ర్జిత భుజ దర్ప మేర్పడగ సింహగజేంద్రములట్లు , వజ్రప
ర్వతములయట్లు , ఘోరతర వాసవ వృత్రులయట్లు నిద్దరున్.
ఇది శ్రీమదాంధ్ర మహాభారతము, సభాపర్వము, ప్రథమాశ్వాసములోని భీమ జరాసంధుల యుద్ధ వర్ణన.
మిక్కిలి బలవంతులు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే పట్టుదల కలవారు అయిన భీమ జరాసంధులు, సింహము ఏనుగులా, వజ్రాయుధము పర్వతములా, ఇంద్రుడు వృత్రాసురునిలా మహా ఘోరంగా పోరాడుతున్నారు.
భీముడు జరాసంధుడు సమాన స్థాయిలో బలపరాక్రమాలున్నవారు. అయితే, కథాగమనంలో, భీముని భావి విజయ సూచకంగా, మూలంలో ఉన్న ఉపమానాల వరుసను మార్చి, నన్నయగారు అర్థవ్యక్తి హేతుత్వాన్ని ఇందులో చూపించారని పెద్దలు చెబుతున్నారు. అది ఎలాగంటే, భీముడు జరాసంధుని మీద పైచేయి ( విజయం ) సాధించబోతున్నాడు కనుక, భీముణ్ణి సింహం, వజ్రాయుధం, ఇంద్రునితోను పోల్చి, జరాసంధుడిని ఏనుగుతోను, పర్వతంతోను, వృత్రునితోను పోల్చారు నన్నయగారు. ఈ విధంగా, రచనలో భీమ విజయాన్ని, జరాసంధ అపజయాన్ని, ధ్వనిపూర్వకంగా సాధించారు ఆదికవి నన్నయ.
No comments:
Post a Comment