గోళకాంతిచ్ఛటల్ పెఱగోళములకు
బయనముం జేయ నబ్దముల్ పట్టునట్లు
రాచదేవిడీలందు వార్తలును జేర
బ్రభువు ప్రభువును మధ్య నబ్దములు పట్టు.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యకాండము లోని తొలి పద్య మిది.
ఈ పద్యాన్ని ఈ శతాబ్దపు కవే వ్రాయాలి. ఈ మాటన్నది పద్యార్థాన్ని వివరిస్తున్న యీ వ్యాఖ్యాత కాదు. కల్పవృక్ష ఫలసారాన్ని పిండి మన కందించిన ఎందరో మహానుభావులలో ఒకరు, " ఇది కల్పవృక్షము " అనే కావ్యానుశీలనాన్ని లోకానికి అందజేసినవారు అయిన బ్రహ్మశ్రీ వడలి మందేశ్వర్రావుగారు. వారికి మనఃపూర్వక నమస్సు లర్పిస్తూ, ఈ వ్రాస్తున్నవాడు చెప్పబోయే విశేషాంశాలన్నీ వారు పెట్టిన భిక్ష మాత్రమేనని విన్నవించుకుంటూ, సవినయంగా ప్రారంభిస్తున్నాను.
పద్యం చిన్నదే. కానీ, చెప్పుకోవడనికి కావలసినంత సామాగ్రి ఉన్న పద్యమిది.
అసలు, వడలివారు, యీ పద్యం యీ శతాబ్దపు కవే వ్రాయవలసిన పద్యమని ఎందుకన్నారు? 20వ శతాబ్దంలో శాస్త్రవిజ్ఞానం బాగా పెరిగింది. దూరవాణి, చరవాణి, అంతర్జాలముల సహాయంతో, ఎక్కడనుంచి ఎక్కడికైనా, వార్తలను పంపగలిగిన వెసులుబాటు మనకుంది. పూర్వం రోజులలో అట్లా కాదు. ఒక గ్రహం నుండి, కాంతి, ఇంకొక గ్రహానికి చేరటానికి కొన్ని క్షణాల నుంచి కొన్ని సంవత్సరాలు పట్టినట్లు, దేవిడీలలో, కోటలో, ఒక వార్త, ఒక చోట నుండి ఇంకొక చోటకు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. నిబంధనలను, ప్రమాద ఘంటికలను దాటుకుంటూ అవి చేరాలి. కొన్ని విషయాలు పెదవి దాటకూడదు.
రాముని యౌవరాజ్య పట్టాభిషేక వార్త తాతగారి రాజ్యంలో ఉన్న భరతునికి చేరలేదు. సుమంత్రుడు చెప్పేవరకు రామునికే తెలియదు. రాముని స్నేహితులు చెప్పేవరకు కౌసల్యకు తెలియదు. రాముణ్ణి తన కొడుకు కన్నా అధికంగా ప్రేమించిన కైకమ్మకు, కలలో కనపడిన దేవతలు, తనను పట్టాభిషేకం చేసుకోవద్దంటున్నారని, రాముడు చెప్పేవరకు తెలియదు. ఇది దేవతల ప్రణాళికలో భాగమని, కైక దుర్బుద్ధి ఫలితం కాదని, దశరథునికి ఆజన్మాంతం తెలియదు. రామునిలో పొడచూపిన వైరాగ్యభావన మాత్రం తెలియడానికి దశరథునికి చాలా సమయం పట్టింది. తెలిసినప్పుడు తండ్రి ఏం చెయ్యాలి?
బ్రహ్మచారి సుతుండు విరాగియైన
జనకు డూహించు సుతు గృహస్థుని బొనర్ప
దా గృహస్థుండె సుతుడు విరాగియైన
దండ్రి వ్యవహార మతనిని దాల్పజేయు.
అందుకే, అప్పటికే గృహస్థుడైన రామునికి తన రాజ్యభారం అప్పగించాలనుకొన్నాడు. రాముని వైరాగ్యభావ వార్తలు అతనికి ముందుగా చేరివుంటే, భరతశత్రుఘ్నులు అయోధ్యలో ఉన్నప్పుడే రామునికి పట్టాభిషేకం చేసేవాడు. ఆలస్యమవడానికి కారణం, వార్తలు సరియైన సమయంలో అందకపోవడమే.
దీనినే గ్రంథిగ్రంథులను విడదీయడమంటారు. చిక్కుముడి విప్పటం. ఎన్నో అపోహలకు , వ్యాఖ్యానాలకు సహేతుకతను కల్పించి చిక్కుముడి విప్పడం. ఇది మహాకవులు తెలిసిచేసే శిల్పరచన.
తల్లి చేసిన పని, దశరథ మరణానంతరం, అయోధ్యకు తిరిగివచ్చేటంతవరకు భరతునికి తెలియదు. తెలిస్తే రామకథ బాలకాండతోనే పూర్తయ్యేది. తెలిస్తే జగన్నాథుడైన రాముడు, కేవలం రాజ్యపాలన చేస్తూ ,సాకేతమేలిన ప్రభువులలో ఒకడిగా మిగిలిపోయేవాడు. అందుకే, ఇదంతా " కైకేయీ సముపజ్ఞము (కైకేయి దివ్యప్రణాళిక) " అన్నాడు భరతుడు.
రాముడొక స్వయంప్రకాశ గోళ మనుకుంటే, అతని వైరాగ్యభావన దశరథ గోళానికి చేరడానికి చాలా సమయమే పట్టింది. దేవతల ప్రణాళిక, కైక వరాలు, తత్ఫలితంగా రాముడు వనవాసానికి వెళ్ళడం - యీ విషయాలన్నీ దశరథునికి తెలియకపోవడమే, రామావతార లక్ష్యం.
మరి ఈ వార్తలు ఎవరికి త్వరగా చేరుతాయి. స్వేచ్ఛాజీవులైన ప్రజలకు, ద్రష్టలైన ఋషులకు. వారికి రాచదేవిడీల నిబంధనలు, కట్టుబాట్లు వర్తించవు. కొండల్లో, కోనల్లో, వాగుల్లో, వంకల్లో బడి అట్లా వస్తూ ఉంటాయి. అంతే!
No comments:
Post a Comment