వాని చక్కదనము వైరాగ్యమున జేసి
కాంక్షసేయు జారకామినులకు
భోగబాహ్యమయ్యె బూచినసంపెంగ
పొలుపు మధుకరాంగనలకు బోలె.
పద్యం చిన్నదే. కానీ, రాబోయే కథకు కీలకమైనది.
ప్రవరుడు చాలా అందగాడు. అంతటి అందగాడు ఒక ఊరిలో ఉన్నాడంటే, అతని కోసం కాసుకొని కూచునేవాళ్ళుంటారు. వారే వారకాంతలు లేక వేశ్యలు. అయితే, ప్రవరుని చక్కదనం వేశ్యలకు పొందరానిదిగా ఉందట. ఎందుచేత? అతని వైరాగ్యభావన చేత. ప్రవరుని వైరాగ్యభావనకు కారణం అతని నియమబద్ధమైన జీవితం. అతడు నిత్యాగ్నిహోత్రి. నిరంతరం శాస్త్రాధ్యయనం చేస్తూ శిష్యులచే చేయించేవాడు. తలిదండ్రుల సేవ చేసేవాడు. అన్నపూర్ణకు సరిపోలదగిన ఇల్లాలు కలిగినవాడు. అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. మంచి గృహస్థు. అంటే సజ్జనుడు. సజ్జనుడికి వైరాగ్యభావం సహజం.
పెద్దనగారు ఈ చక్కదనము భోగబాహ్యమవటాన్ని ఉపమాలంకారము ద్వారా చక్కగా సూచించారు. ఏమిటంటే అది, సంపెంగపూవుకి మంచి వాసన ఉంటుంది. నిజానికి, ఆ వాసనకు ఆకర్షితమై తుమ్మెదలు వ్రాలి మకరందాన్ని త్రాగాలి. కానీ, తుమ్మెదలకు సంపెంగపూవుకి చుక్కెదురు. తుమ్మెదలు అన్ని పూల మీద వ్రాలుతాయి ఒక్క సంపెంగ తప్ప. మధుకరాంగనలకు సంపెంగ భోగబాహ్యం. ఇక్కడ సంపెంగపూవు ప్రవరాఖ్యుడు, మధుకరాంగనలు వారకాంతలు. ఎంత చక్కని పోలిక.
సందర్భం వస్తే, దానిని చక్కగా వాడుకొనటం మహాకవుల లక్షణం. వాటినే ప్రతిభావ్యుత్పత్తు లంటారు.
వసుచరిత్రములో భట్టుమూర్తిగారు కూడా, " నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మేలా నన్నొల్ల దటంచు గంధఫలి " అంటూ గిరికాదేవి ముక్కుకి ఒక క్రొత్త అందాన్ని తెచ్చిపెట్టారు.
జీవితం ఆనందమయ చేసుకోవడం మన చేతుల్లో ఉన్నది. ఇటువంటి కావ్యాలు చేతనయినంతలో చదుకుంటుంటే రోజులు వెళ్ళిపోవా?
ఇది ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దనామాత్యుని మనుచరిత్రము ప్రథమాశ్వాసం లోనిది.
No comments:
Post a Comment