ఇది కడు ముద్దరాలు, పను లేమియు చేయగ నేర, దెంతయున్
మృదు, వొక కీడుపాటునకు మేకొనజాల, దుదాత్తచిత్త, యొం
టి దిరుగు దాని కోర్వ, దొకటిం దను దా సవరించు చొప్పెఱుం
గదు, తగ నొడ్లనుం గొలువగా వెర వెమ్మెయి గల్గు నక్కటా!
తిక్కనగారి ప్రసిద్ధ పద్యాలలో ఇది కూడా ఒక పద్యం. అచ్చ తెలుగు పదాలతో పద్యం నడిచిన తీరు చూస్తేనే, పఠితకు ద్రౌపది యెంతటి ముద్దరాలో, సేవలు అందుకొనడమే తప్ప, సేవించడం యెరుగని యెంతటి మహారాణీత్వం కలదో అర్థమవుతుంది.
అజ్ఞాతవాస కాలంలో ఎవరు ఏ పని చేయాలో పాండవులందరూ నిర్ణయించుకొన్నారు. ఇక ద్రౌపది ప్రస్తావన వచ్చేటప్పటికి, ధర్మరాజు మనస్సు వేదనతో నిండిపోయింది. ఆ వేదనకు తిక్కనగారి అక్షర రూపమే యీ పద్యం.
" ఈమె చాల సుకుమారి. సేవలు చేయించుకొనడమే గాని, చేయడం తెలియనిది. మెత్తని మనస్సు కలది. చేయకూడని పనులు చేయడానికి సమ్మతించదు. ఉన్నతాశయాలు కలిగినది. ఒంటరిగా తిరగడానికి సిద్ధపడదు. ఏ ఒక్క పనినీ తనంతట తాను చక్కబెట్టుకొనే తీరు తెలియదు. ఇటువంటి ఈమె ఇతరులను యెట్లా సేవిస్తుందో? ఆ నేర్పు యెట్లా పొందుతుందో? "
ఇదీ ధర్మరాజు ఆవేదన.
ఈ పద్యానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, విరాటపర్వము, ప్రథమాశ్వాసమునకు, డాక్టరు కే. సర్వోత్తమరావుగారి, సంపాదకవర్గం వారి విశేష వ్యాఖ్యను ఇక్కడ యధాతథంగా పొందుపరచడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నాను.
మూలంలో, " ద్రౌపది మనందరికీ ప్రియమైన భార్య. మన ప్రాణాలకంటె మిన్న అయినది. తల్లివలె పరిరక్షించదగింది. సోదరివలె మన్నించదగింది. " అని అనటం తిక్కన వదలివేశాడు. మూలంలో ఆర్ద్రత ఉన్నా, తెలుగులో ఔచిత్యం ఉన్నది. పాండవపత్నిగా ఆమె ప్రశంస అజ్ఞాతవాస నియమానికి ప్రస్తుతం కాదు. ఆమె ఇతరుల సేవలో ఎట్లా ఉండగలుగుతుంది - అనేదే ప్రస్తుతాంశం. పాండవు లందరిలో ఆ అంశాన్ని మాత్రమే ఎన్నుకొని తిక్కన విషమాలంకార సుందరంగా వ్యక్తీకరించాడు. తిక్కన పద్యంలో ద్రౌపదిని వర్ణించిన తీరు అనుభావ వ్యంజకంగానూ, భావికథార్థ సూచకంగానూ ఉండటం తిక్కన కావ్య కళాశిల్పం. విరాటపర్వంలో - విశేషించి కీచక ఘట్టంలో - ద్రౌపది పడేపాట్లను ప్రచ్ఛన్నంగా ధ్వనింపజేసే వాక్యవిన్యాసం గమనార్హం. ఆమె కడు ముద్దరాలు. ఎంతో మనోజ్ఞమైనది అని భావం. సుదేష్ణను మెప్పించిందీ, కీచకుడిని ఆకర్షించిందీ అయిన లావణ్యవిశేషం ఇందులో సూచితం. కష్టపడే పనులు చేయలేనిది. కాబట్టే సైరంధ్రిగా అలంకరణ సేవలో ఉండిపోయింది. ఆమె ఎంతో మెత్తనిది కాబట్టి కొలువులో ఒదిగి మర్యాదగా ఉండగలిగింది. ఒక కీడుపాటునకు కూడా సహించలేనిది కాబట్టి కీచకుడి వలపు బాసలను ఓర్చుకొనలేకపోయింది. ఉదాత్తచిత్త కాబట్టి అన్యపురుషవాంఛకు లోనుకాకుండా కీచకుడికి అన్యకాంతాసమాగమవాంఛ హేయమని చెప్పగలిగింది. ఒంటిగా తిరగటానికి సిద్ధపడదనే విశేషం - కీచకుడి ఇంటికి కల్లు తీసికొని రావటానికి ఒంటిగా పోవటాన్ని ఆమె అంగీకరించకపోవడానికి హేతువయింది. ఏ విషయాన్నైనా తాను స్వతంత్రించి ఒంటరిగా చేయటం అలవాటు లేనిదట. అంటే భర్తల అనుమతితో చేసేది అనే భావం ఏర్పడుతుంది. కీచకోదంతాన్ని పాండవుల దృష్టికి తెచ్చి, వారి ఎఱుకతో కార్యాన్ని నిర్వహించిన కథార్థాన్ని ఇది స్ఫురింపజేస్తుంది. ఇది వస్తుధ్వని. ఇక ద్రౌపదికి వాడిన విశేషణాలన్నీ ఆమె మహారాణీత్వాన్ని సూచించేవి. సేవలు చేయించుకొన తగిన స్నిగ్ధమూర్తి ఎవరిని సేవించగలదు? అనే విషమాలంకార చిత్రణకు అనువుగా చెప్పబడినవి. తిక్కన తెలుగు పదాల జిలుగు రచనకు ఈ పద్యం హృద్యమైన ఉదాహరణం.
ఇన్ని భావాలను ఒక్కపెట్టున స్ఫురింపజేసిన ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, విరాటపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment