ఏను మృతుండ నౌదునని యింత భయంబు మనంబులోపలన్
మానుము; సంభవంబు గల మానవకోట్లకు జావు నిత్యమౌ
గాన హరిం దలంపు మిక గల్గదు జన్మము నీకు ధాత్రిపై
మానవనాథ! పొందెదవు మాధవలోకనివాససౌఖ్యముల్.
శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుకి యుగధర్మాలు చెప్పాడు. చివరిదైన కలియుగ ధర్మాలను కూడా చెప్పాడు. అధర్మం నాలుగు పాదాల నడిచే కలియుగంలో హరినామ సంకీర్తన మొక్కటే, భవ బంధాల నుండి విముక్తి కలిగిస్తుందని చెప్పాడు.
" ఓ పరీక్షిన్మహారాజా! అయ్యో! నేను చనిపోతానే అనే భయాన్ని మనసులో నుంచి తేసివేయి. మనిషికి పుట్టడం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. కాబట్టి, హరిని స్మరించు. అప్పుడు నీకు ఈ భూమి మీద మళ్ళీ పుట్టడమనే మాటుండదు. నీకు శాశ్వత వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. "
శుకమహర్షి ఏదైతే బోధ పరిక్షిత్తుకు చేశాడో, అది సమస్త మానవజాతికి వర్తిస్తుంది. కలియుగ ధర్మం ప్రకారం, మనిషికి అడుగడుగునా అధర్మ ప్రవర్తన, అధర్మాచరణ కనపడుతుంటాయి. జీవులు జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ, పుడుతూ చస్తూ ఉంటారు. పుట్టడమనేది కర్మఫలంగా జరుగుతుంది. పుట్టడమనేది జరిగితే ఆయువు తీరిన తరువాత మరణించడ మనేదీ తప్పదు. ఈ జనన మరణ చక్రంలో నుండి బయటపడి, పుట్టుక లేకుండా, శాశ్వత వైకుంఠలోకానందం కలగాలంటే, సంతత హరినామ సంకీర్తన మొక్కటే మార్గం. సంకీర్తన అంటే, విషయవ్యాపారాలను ప్రక్కనబెట్టి, హరి యందు, చిత్తాన్ని నిలిపి, అతడే సర్వాత్మకుడనే భావనతో, ధ్యానం చేయడం. అప్పుడే భవబంధ విముక్తి కలుగుతుంది. అంతేగాని, భయపడటం వల్ల లాభం లేదు. భయపడటం జంతులక్షణం, భయాన్ని జయించడం ఆత్మయోగి లక్షణం. అదే ప్రహ్లాదుడు చేసింది. అదే మనం చేయవలసింది.
మానవజాతి ముందున్న ఒకే ఒక మార్గాన్ని ఇంత చక్కగా తెలియజేసిన ఈ పద్యం పోతనామాత్యుని ప్రియశిష్యుడు పూరించిన శ్రీమదాంధ్ర మహాభాగవతం, ద్వాదశ స్కంధం లోనిది.
No comments:
Post a Comment