ఎక్కడ లేరె వేల్పులు సమీప్సితదాతలు ముద్దుగూన! నీ
వెక్కడ? ఘోరవీర తప మెక్కడ? యీ పటుసాహసిక్యముల్
తక్కు శిరీషపుష్ప మవధానపరత్వమునన్ మధువ్రతం
బెక్కిన నోర్చునో విహగ మెక్కిన నోర్చునొ నిశ్చయింపుమా.
శివుని భర్తగా కోరి పార్వతి ఘోరతపస్సు చేయడం మొదలుపెట్టింది. విషయం తెలుసుకున్న తల్లి మేనక, కూతురుని బుజ్జగించి, ప్రేమతో యీ విధంగా చెప్పింది.
" చిట్టితల్లీ! కోరకుండానే వరాలిచ్చే దేవతలు యెంతమంది లేరు? నువ్వేమిటీ? ఈ ఘోరమైన తపస్సేమిటి? ఇంత సాహసానికి పూనుకోవద్దమ్మా. అతి సుకుమారమైన నీ శరీరం ఇంత ఉగ్రమైన తపశ్చర్యకు, ఏకాగ్రతకు తట్టుకొనగలదా? శిరీషపుష్పం మీద, అనగా మంకెనపూవు మీద, తుమ్మెదలబారులు గానీ, లేకపోతే ఒక పక్షి గానీ, వ్రాలితే, తట్టుకోగలదా? "
పరమ సుకుమారి అయిన పార్వతి తీవ్రమైన తపోదీక్ష భరించలేదని భావము.
పద్యం ఆద్యంతం అతి సరళంగా సాగి, మధ్యలో సంస్కృతపదాలతో, ఉగ్రమైన తపస్సును తలపింపచేస్తున్నది.
ముద్దుగూన అని కూతురిని సంబోధించడంలో మాతృహృదయం ధ్వనిస్తున్నది. ఎవరు వ్రాయగలరు ఇంత మంచి పద్యాన్ని? ఔచిత్యం తెలిసిన మహాకవులు తప్ప!
ఈ పద్యం శ్రీనాథ కవిసార్వభౌముని హరవిలాసము చతుర్థాశ్వాసము లోనిది.
No comments:
Post a Comment