వేదములుం తదంగములు వింతలుగా నొక కొన్ని నేర్తు ధై
ర్యాది గుణంబు లెందు గల వైనను నింతటి వాని గాగ న
త్యాదర వృత్తి మీరు విజయాశ ననుం గొనియాట జేసి యౌ
గాదన కియ్యకొంటి దగ గౌరవనాథుని కోర్కి దీర్పగన్.
ద్రోణాచార్యుడికి సర్వసైన్యాధ్యక్ష పదవి కట్టబెట్టింది కౌరవపక్షం. దానికి తన స్పందనను తెలియజేస్తున్నాడు ఆచార్యుడు.
" వేదాలు, వేదాంగాలు కొన్ని నేను కొంతవరకు నేర్చుకొన్నాను. ఇక మీరందరూ నా ధైర్యసాహసాలను మెచ్చుకొంటున్నారు. ఆ చెప్పిన ధైర్యసాహసాలు నాకెక్కడివి? అయినా మీరందరూ విజయం మీద ఆశతో నన్నింత వానిగా ప్రశంసిస్తున్నారు కాబట్టి, దుర్యోధనుడి మాట కాదనలేక యీ సర్వసైన్యాధిపత్యానికి ఒప్పుకుంటున్నాను. "
ద్రోణాచార్యుని మాటలు చాలా జాగ్రత్తగా, తూచినట్లు మాట్లాడినవి.
ఆయన వేద, వేదాంగాలు క్షుణ్ణంగా నేర్చుకున్నవాడే. కానీ, కొంతవరకే నేర్చుకొన్నానంటున్నాడు. " అదికూడా వింతలుగా, ఆశ్చర్యకరంగా, నేర్చుకొన్నాడట. అంటే పరశురాముని వంటి వాని వద్ద నుండి గురుకృపతో ప్రాప్తించినాయని అర్థం చేసుకొనవచ్చు, ఇంకొక విధంగా, ఆ వేదాలు ప్రతిపాదించిన ధర్మ స్థితి ఇప్పుడు తప్పిందని అర్థం కూడా కావచ్చు. ధైర్యాది గుణంబు లెందు గలవు " అంటున్నాడు. ఇవి రెండువైపుల పదునైన కత్తివంటి మాటలు. ఇవి ఒకవైపున ద్రోణుని వినయసంపదను సూచిస్తూ, ఇంకొక వైపు అతని ముందు చూపును కూడా తెలియజేస్తున్నాయి. గతంలో, సుయోధనుడు తనను పలుమార్లు అధిక్షేపించిన సంగతి అతని స్మృతిపథంలో ఉంది. ఇక కురురాజు యొక్క ఉప్పు తింటున్నాడు కనక, సేవాధర్మంతో, తన శక్తి మేరకు యుద్ధం చేయవలసిందే. వీళ్ళందరూ తనను ఇంతటివానిగా ఎందుకు పొగుడుతున్నారు? విజయాశతో. విజయం మీద ఆశతో, విజయుడిని గెలుస్తాననే ఆశతో. అందువల్ల, ఔను, కాదు అనలేక, సుయోధనుని ముద్దు చెల్లించటానికి ఒప్పుకుంటున్నాడు. కానీ, యదార్థం అతనికి తెలుసు. కురురాజు ఆశలు అడియాశలవుతాయని. వేదాలు, వేదాంగాలు నేర్చుకొన్నవాడికి తెలియదా ధర్మమే గెలుస్తుందని!
మానవస్వభావం లోతులు తెలిసిన మహాకవులే ఈ విధంగా వ్రాయగలరు. తిక్కన అందులో సిద్ధహస్తుడు.
వేదాలు నాలుగు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. వేదాంగాలు ఆరు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం.
ఇంతటి భావయుక్తమైన పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, ద్రోణపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment