జను డజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన అన్నంబు స
య్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్
ఘను నిందించిన నీ తనూభవ యనంగా నోర్వ, నీ హేయ భా
జన మైనట్టి శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి బాటిల్లెదన్.
స్త్రీ పాతివ్రత్యాన్ని, గొప్పదనాన్ని, ఆడపిల్లలకు చిన్నప్పటినుంచీ ఉగ్గుపాలతో పాటు చెప్పే పురాణకథలలో సతీదేవి కథ కూడ ఒకటి.
అవమానం పాలవుతుందని భర్త చెప్పినా, పుట్టింటి మీద ప్రేమతో, దక్షయజ్ఞానికి వెళ్ళిన సతీదేవి, శివనిందను భరించ లేకపోయింది. దక్షుని కూతురు దాక్షాయణిగా లోకుల చేత ఇక ఏ మాత్రమూ పిలవబడటానికి మనస్సు అంగికరించలేదు. యోగాగ్నిలో తన దనువును దహించి వేయడానికి సిద్ధపడిన సందర్భం లోనిది యీ పద్యం.
" పాడయిపోయిన అన్నం తింటే, అది వ్యాధి రూపంలో పరిణమిస్తుంది. అందుకని, ప్రయత్నపూర్వకంగా ఆ అన్నాన్ని కక్కివేస్తాము. అప్పుడు శరీరానికి స్వస్థత చేకూరుతుంది. అదే విధంగా, దుష్టుడవై, శివాపరాధానికి పాల్పడ్డ నీకు కుమార్తెను అనిపించుకొనడానికి అసహ్యం వేస్తున్నది. అందుకని, నీ వల్ల ప్రాప్తమైన యీ పాడు శరీరాన్ని విడిచిపెట్టి పవిత్రురాలనవుతాను. "
శ్రీమదాంధ్రమహాభాగవతము చతుర్థస్కంధము లోనిది యీ పద్యము.
No comments:
Post a Comment