శరతల్పమున నుండి శాంతనవుండు బీ
భత్సు దివ్యాస్త్ర వైభవము దెలుప
దివిరి జలం బట్లు దెప్పించుకొని యప్డు
పాండుసూనులతోడి బాంధవంబు
నడపుము సిరి పంచి కుడుచుట మే లింత
తో గయ్య ముడిగి శాంతుడవు గమ్ము
బ్రదుకుము నీ వన్న పనుపుసేయడు సుయో
ధను డిప్డు శోకాబ్ధి మునుగ కున్నె?
పడుచు లీక లూడ్చి పట్టి యాడెడునట్టి
పులుగు చందమయ్యె దలప నా య
వస్థ యెందు జొచ్చు వాడ? నీ యలమట
దీర్ప నెవ్వ రిందు దిక్కు గలరు?
యుద్ధరంగంలో కర్ణుడు కూడా పడిపోయిన తరువాత, ధృతరాష్ట్రుడు చెప్పలేని దుఃఖానికి లోనయ్యాడు. అంశయ్యమీద ఉన్న భీష్ముడి మాటలను గుర్తుకు తెచ్చుకుని, ఈ విధంగా దుఃఖిస్తున్నాడు.
" అంపశయ్యమీద ఉన్న భీష్ముడు, అర్జునుని యొక్క శస్త్రాస్త్ర నైపుణ్యాన్ని దుర్యోధనాదులకు మరొకమారు గుర్తు చేసి, వారిని యుద్ధం నుంచి విముఖులుగా చేయాలనుకొన్నాడు. అందుకనే, దాహమనే మిషతో, అర్జునుడి బాణప్రయోగంతో, పాతాళగంగాజలాన్ని తెప్పించేటట్లు చేసి, తన దాహం తీర్చుకొనే సన్నివేశాన్ని కల్పించాడు. ఆ తరువాత, పాండవులతో సఖ్యం చేసి, వారి రాజ్యం వారికిచ్చి, యుద్ధానికి స్వస్తి చెప్పి, శాంతిపథంలో నడవమన్నాడు. కానీ, దుర్యోధనుడు ఆ మాటలు పెడచెవిన పెట్టాడు. ఇక ఇప్పుడు శోకసముద్రంలో మునుగకుండా ఉంటాడా? అదుపు ఆజ్ఞలు లేని పిల్లలు గనుక, పక్షి రెక్కలు పీకేసి, దానిని ఎగురకుండా చేసినట్లయింది నా పని. ఈ బాధ నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళేది? ఈ బాధలు పోగొట్టటానికి నాకు ఇంకెవరు మిగిలున్నారు? "
ఈ సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాబారతము, ద్రోణపర్వం, ప్రథమాశ్వాసానికి విశేష వ్యాఖ్యను వ్రాసిన డాక్టరు జీ. హరిహరనాథ్ గారిని, సంపాదకవర్గం వారిని, అభినందించాలి. ఈ పద్యానికి వారు అందించిన విశేష వ్యాఖ్యను కూడా పొందుపరుస్తున్నాను.
" తిక్కనగారి మహాకవిత్వం ప్రతి పదంలోనూ కనిపిస్తున్నది. ' శరతల్పమున నుండి ' అనటంలో భీష్ముడు మరణోన్ముఖుడై ఉన్నాడు. ఆయన ఇదివరకటి వలె పక్షపాతబుద్ధి కలవాడు కాడు. ఇట్టి పరిస్థితిలో ఏమి చేసినా ఎల్లరి మేలుకే తప్ప, స్వార్థంతో కాని, పక్షపాతబుద్ధితో కానీ ఏ పని చేయడని సూచితం. ' శాంతనవుండు ' అనటంలో ఆయన జన్మపవిత్రత సూచితం. భీష్ముడి తండ్రి రోగగ్రస్తుడిని తన చేతులతో స్పృశిస్తే, అతని రోగం తొలగి శరీరం (తనువు) శాంతి వహించేది. కనుక అతడు శాంతతనుడు - శంతనుడు అని అనిపించుకొన్నాడు. అట్టివాని పుత్రుడు అహితం చెప్పడని సూచితం.
అట్టిదే ' బీభత్స ' శబ్దం. అర్జునుడి గొప్పతనాన్ని దీని ద్వారా చెప్పదలచుకొన్నాడు భీష్ముడు. అర్జునుడు యుద్ధం చేస్తుంటే, యుద్ధభూమిని చూస్తే జుగుప్స కలిగేటట్లు చంపుతాడట. అందువలన అతడి కాపేరు. అట్టివాడికి దివ్యాస్త్రాలు తోడు. కనుక అతడితో స్నేహమే కార్యం అని స్ఫురిస్తుంది. "
ఇదే తిక్కనగారి కావ్యకళాశిల్పం. " తిక్కన్న శిల్పంపు తెనుగు తోట " అన్న విశ్వనాథవారి మాట అక్షర సత్యం.
No comments:
Post a Comment