తిరుపతికిం బోయి యొడలి నగలెల్లదీసి యిచ్చెదరు
హర! వచ్చి నిను జూచి యొక్క నమస్కార మాచరించెదరు
వెరపించుటకు మరపించుటకు గల భేద మిది హర
హర హర మహాదేవ! శ్రీకాళహస్తీశ్వరా! మహాదేవ!
విశ్వనాథ మధ్యాక్కరల లోని శ్రీ కాళహస్తి శతకము నందలి ఈ పద్యం, లోకుల భావనలో శివునికి కేశవునికి ఎంత భేద మున్నదో చక్కగా, సున్నితమైన హాస్యంతో తెలియజేస్తున్నది.
కోరిన కోర్కెలు తీర్చేవాడని, కలియుగ ప్రత్యక్ష దైవమని వేంకటేశ్వరస్వామి మీద అమితమైన భక్తి ప్రజలకి. కోరికలు కోరుకొని, అవి తీరిన తరువాత, తిరుపతి కొండకు వెళ్ళి, ముడుపులు చెల్లించుకుంటారు. తిరుపతికి కొద్ది దూరంలో శ్రీ కాళహస్తి ఉంది. అక్కడికి పోయి, శివుడికి ఒక దణ్ణం మాత్రం పెట్టొస్తారు. ఇదేమి భేదమో అని విశ్వనాథవారు చమత్కారంగా అడుగుతున్నారు.
జనానికి వేంకటేశ్వర స్వామి మీద భయభక్తు లున్నాయి. కోరికలు తీర్చుకొనడానికి మొక్కుకొని, అవి తీరిన తరువాత మొక్కు చెల్లించుకొనకపోతే , దేవుడికి కోపమొస్తుందని భయం. దీనికి భిన్నంగా, శివుడు బోళాశంకరుడని తెలుసు. భక్తికి లొంగిపోతాడని తెలుసు. అందుకనే ఆయనను మరపించి, ఒక నమస్కారంతో మురిపిస్తారు.. వీలైతే ఒక చెంబెడు నీళ్ళు శివలింగం మీద పోస్తారు. అంతే, ఆయన ప్రసన్నుడౌతాడు. వెరపించటానికి, మరపించటానికి ఇంత తేడానా? అని విశ్వనాథ వారంటున్నారు.
' హర హర మహాదేవ ' అని చివరి చరణంలో అనడంలో, శివునికి ఎంత అన్యాయం జరిగిపోతున్నదని, శివుడెంత అమాయకుడని ధ్వనిపూర్వక వ్యంగ్యం.
విశ్వనాథవారి జీవితంలో శివకేశవు లిద్దరికీ భేదం లేదనీ, చిన్నప్పటి నుండి వారి ఊరిలో ఉన్న వేణుగోపాల స్వామి, శివాలయాల్లో ఉన్న మూర్తులు ఆయన గుండెలో గూడుకట్టుకొని ఉన్నారని వారి ఆత్మకథ ద్వారా మనకు తెలుస్తుంది. శ్రీమద్రామాయణ కల్పవృక్షము అనే రామకథాకావ్యాన్ని శివునికి అంకిత మిచ్చారు విశ్వనాథవారు. అదీ విశ్వనాథవారికి శివకేశవులపై గల అభేదబుద్ధి.
చమత్కార ధోరణిలో సాగిన ఈ పద్యంలో ఏకస్వరూపమయిన శివకేశవ తత్త్వాన్ని లోకం దృష్ట్యా ఒకరు వెరపించి ముడుపులు చెల్లించుకొనే దేవుడిగాను, ఇంకొకరిని మైమరచిపోయి, అడిగినవన్నీ ఇచ్చే దేవుడిగాను చిత్రించారు వీశ్వనాథవారు.
No comments:
Post a Comment