కని చేతన్ సెలగోల బట్టికొనుచుం " గానిమ్ము గానిమ్ము రా
తనయా ! యెవ్వరియందు జిక్కువడ నే దండంబునుం గాన నే
వినివారంబును బొంద నే వేఱపు నే విభ్రాంతియుం జెంద ము "
న్ననియో నీవిటు నన్ను గైకొనమి నేడారీతి సిద్ధించునే.
పోతనగారి ఆంధ్రమహాభాగవతములో దశమస్కంధ మనగానే చిన్నికృష్ణుని బాల్యక్రీడలు గుర్తుకొస్తాయి. పూర్వం, ఒకమాదిరి చదువుసంధ్యలున్న తెలుగిండ్లలో, దశమస్కంధం లోని పద్యాలు కొద్దో గొప్పో రాని వారుండేవారుగాదు.
ఇంట్లో చిన్నికృష్ణుడు చేసే గోల ఎంతని చెప్పాలి? ఒక రాయితో వెన్నకుండను పగలగొట్టి వెన్న బాగా తిన్నాడు. యశోద పట్టుకోబోతే, తుర్రున పారిపోయాడు. ఇంకో ఇంట్లో రోలు తిరగేసి, దాని మీద యెక్కి, ఉట్టిలో ఉన్న వెన్న తాను తిని, అక్కడ ఉన్న కోతికి పెట్టాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన యశోద, చేతిలో చెర్నాకోల పట్టుకొని, కృష్ణుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ అన్న మాటలు యివి.
" సరే, అట్లాగే కానీ! నువ్వు ఎవరికీ దొరకవని, ఎవరూ నిన్ను దండించలేరని, నువ్వు ఏ రకమైన నిర్బంధంలో ఉండవని, ఏ బెదరింపులు నీకు పనిచేయవని, నీకు ఏ విధమైన తొందరపాటు లేదని, అనుకుంటున్నావు కదా! అందుకే నువ్వు నన్ను లక్ష్యపెట్టడం లేదు కదా! కానీ, అది కుదరదు. ఇవ్వాళ నిన్ను పట్టుకు తీరుతాను. "
ఈ మాటలు యశోద అప్రయత్నంగా అన్నా కూడా, అవన్నీ యదార్థాలు. భగవంతుడు ఎవరికీ కట్టుబడడు. ఏ దండనలు ఆయన మీద పనిచేయవు. ఏ రకమైన నిర్బంధాలు ఆయనకు సరిపోవు. ఆయన ఒక్క ప్రేమ, భక్తి అనే పాశంతోనే కట్టుపడతాడు.
సెలగోల అంటే ఒక చిన్న కర్రకు ఒక వైపు మూరెడు తాడు కట్టి, గుర్రాలను, ఆవులమందను అదిలించడానికి ఉపయోగించేది. దీనిని తెలుగు ప్రాంతాలలో యెవ్వువమంది చెర్నాకోల అంటారు.
No comments:
Post a Comment