వీరు నమ్మంగ దగుదురు వీరు నమ్మ
దగరు నాకు నా వలవదు, తత్త్వబుద్ధి
నెవ్వరిని విశ్వసింపక యెల్ల ప్రొద్దు
నాత్మరక్షాపరుం డగు నది విభుండు.
ఇమ్ముగ నాత్మరక్ష విధియించు విధంబున మంత్రరక్ష య
త్నమ్మున జేయగావలయు, దత్పరిరక్షణశక్తి నెల్ల కా
ర్యమ్ములు సిద్ధి బొందు బరమార్థము, మంత్రవిభేద మైన గా
ర్యమ్ములు నిర్వహింపగ బృహస్పతికైనను నేరబోలునే.
తన కపకారము మును జే
సిన జను డల్పు డని నమ్మి చేకొని యుండం
జన దొకొయించుక ముల్లయి
నను బాదతలమున నున్న నడవగ నగునే
తడయక సామభేదముల దానములన్ దయతోడ నమ్మగా
నొడివియు సత్యమిచ్చియు జనున్ జననాథ! కృతాపకారులం
గడగి వధింపగా గనుట కావ్యు మతం బిది గాన యెట్టులేం
గడుకొని శత్రులం జెరుపగాంచుట కార్యము రాజనీతిమైన్.
శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వము, షష్ఠాశ్వాసంలో కణిక నీతులని ఉన్నాయి. కణికుడు శకునికి మంత్రి. ధృతరాష్ట్రుడు యుధిష్ఠురునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయడంతో, మాత్సర్యం వహించిన దుర్యోధనుడు, కణికుడితో మంతనాలు సాగించాడు. అ సందర్భంలో, శత్రువు మీద పై చేయి సాధించటానికి ఏమేమి చేయాలొ చెప్పినవే కణిక నీతులని ప్రసిద్ధి నొందాయి.
" రాజుకి వీడు నమ్మదగినవాడు, వీడు నమ్మదగినవాడు కాదు అనే భేదము ఉండకూడదు. అసలు, ఎవరినీ నమ్మకుండా, తనను తాను రక్షించుకోవాలి.
అదేవిధంగా, రాజు తన అంతరంగంలో ఉన్న ఆలోచనలను కూడా రక్షించుకోవాలి. అవి బయటపడకుండా ఉంచుకొనడంలోనే, అతని బల మంతా ఉంది. అప్పుడే, అతని పనులు ఫలప్రదమౌతాయి. అవి బయటపడ్డాయంటే, ఇక వాటిని ఫలవంతం చేయడం బృహస్పతికైనా సాధ్యం కాదు. (బుద్ధిలో బృహస్పతిని మించిన వారు లేరు కదా!)
కాలులో గుచ్చుకున్న ముల్లు చిన్నదే అయినా, వెంటనే తీసివేయాలి. లేకపోతే నడవలేము. అట్లాగే, తనకు అపకారం చేసినవాడు అల్పుడయినా, అతడిని ఉపేక్ష చేయకూడదు.
తనకు అపకారం చేసిన వారిని, ముందు సామ, దాన, భేదోపాయాలతో లొంగదీసుకోవాలి. అది కూడా పని చేయకపోతే, దయ చూపించి, నమ్మకం కల్పించి, ఒట్టు వేయించుకోవాలి. ఈ విధంగా మెల్లగా నమ్మకం కలిగించి, గుట్టుచప్పుడు కాకుండా మట్టుపెట్టాలి. ఇది శుక్రాచార్యుడు చెప్పిన రాజనీతి. కాబట్టి, ఏ విధంగా నైనా శత్రువుని మట్టుపెట్టకండా ఉండకూడదు. "
శుక్రాచార్యుడు భృగువు (కవి) కుమారుడు కనుక కావ్యుడని ప్రసిద్ధి వహించాడు.
No comments:
Post a Comment