సితతర కాంత్యుషః ప్రభల చేరువ జీరగ నల్ల చిర్మొగిల్
గతి, వికసత్సితాంబుజ ముఖంబున శైవలవల్లి పోలికన్
సతుల మొగంబులం దొక విషాదరేఖను గాంచి ధారణీ
పతి యిదియేమియంచడుగ బట్టడు తానును దీనవక్త్రుడై.
" ఉషోదయకాలంలో, తెల్లని సూర్యకాంతి అలుముకున్న ఆకాశమధ్యంలో ఒక చిన్న మబ్బుతునకలాగా, వికసించిన తెల్లతామర మధ్యలో నాచులాగా, దశరథుని రాణుల ముఖాలలో ఒక విషాదరేఖ కనిపిస్తున్నా కూడా, రాజు దైన్యానికి లోనయి అది యేమిటని అడుగడు. "
పుత్రసంతానం కోసం పరితపిస్తూ, దైన్యంలో ఉన్న దశరథుడు, తన రాణుల ముఖాలలో కూడ అదేరకమైన విషాదరేఖ చూసాడు. కానీ, ఆ విషాదాన్ని గురించి ఏమీ అడగడు. దానికి కారణం, అతనికి కూడ తెలుసు కదా! అందువల్ల, నిస్సహాయుడై మానసికవ్యథ అనుభవిస్తూ ఉన్నాడు. ఇది, మానవస్వభానికి చాల దగ్గరగా ఉంది.
విశ్వనాథవారు లోకము నెరిగి రచన చేసే మహాకవి. కల్పవృక్షావతారికలో, విశ్వనాథవారు " రసము పుట్టింపగ వ్యవహారము నెఱుంగ/ జనును లోకమ్ము వీడి రసమ్ము లేదు. " అని వ్రాసారు. విశ్వనాథవారు లోకము నెరిగిన మహాకవి.
No comments:
Post a Comment