భారతవర్ష జంతువుల భాగ్యము లేమని చెప్పవచ్చు? నీ
భారతవర్షమందు హరి పల్మఱు బుట్టుచు జీవకోటికిన్
ధీరతతోడ దత్త్వ ముపదేశము చేయుచు జెల్మి జేయుచు
న్నారయ బాంధవాకృతి గృతార్థుల జేయుచునుండు నెంతయున్.
శ్రీమదాంధ్రమహాభాగవతము పంచమస్కంధము నందలి యీ పద్యం భారతదేశము యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుంది. భారతదేశము అంటే భరతఖండము.
భరతవర్షంలో పుట్టడం జీవులు చేసుకున్న అదృష్టం. ఎందుకని? ఈ గడ్డ మీదే శ్రీమన్నారాయణుడు అనేకమార్లు అవతరించాడు. ఆ అవతరించడం ఎన్నో రూపాల్లో అవతరించాడు. అవతరించిన ప్రతిసారీ, తత్త్వాన్ని ఉపదేశం చేశాడు. తత్త్వం అంటే, " ఏదైతే యదార్థంగా ఉన్నదో " అది. " ఏదైతే శాశ్వతమో " అది. " తత్ - త్వం - అసి (తత్వమసి) - " అది నీవే అయి ఉన్నావు " అనే మహావాక్యానికి, సనాతన ధర్మానికి మూలబీజం. " అది నువ్వే " అనే ఆత్మజ్ఞానం.
పోతనగారు ' జంతువుల ' అనే పదం ఉద్దేశ్యపూర్వకంగా వాడారు. ఆహార నిద్రా భయ మైథునాదులు జంతులక్షణాలు. బుద్ధిజీవియైన మానవుడు, ఆ లక్షణాలను అంతరింపజేసి ఆత్మజ్ఞానంతో తరించాలి. ఆ మూలతత్త్వమే భాగవతమంతా పరచుకొని ఉంది.
అభవుడైన, అంటే, పుట్టుకలేని పరమాత్మ, పుట్టినవారితో స్నేహం చేశాడు, చుట్టరికం నెరిపాడు. ఆ విధంగా యీ భూమి మీద పుట్టిన జీవులందరినీ కృతార్థులను చేశాడు. పుట్టుక లేని భగవంతుడు పుట్టడం అంటే, కర్మానుభవం పొందడం, కర్మసిద్ధిని పొందడం.. అయితే, ఆ పుట్టడం మన పుట్టుక వంటిది కాదు. దానిని అవతరించడం అంటారు. అవతారము అంటే దిగిరావడం. సంసారమంటే జారిపోవడం. ఆత్మజ్ఞానం నుంచి జారిపోయే బుద్ధిజీవులను, వారి బుద్ధిని ఆత్మజ్ఞానం వైపుక్కి మరలించడమే, తత్త్వ ముపదేశించి, కేతార్థులను చేయడం. ఇది భరతబూమిలోనే సాధ్యం. అవతారమెత్తిన ప్రతిసారీ, శ్రీమహావిష్ణువు, విశ్వకళ్యాణం కోసం, ఒక కార్యసిద్ధి నొనరిస్తూ, ఒక తత్త్వోపదేశం చేస్తూ, ఒక కృతార్థతను కలిగిస్తున్నాడు. అందువల్లనే, యీ భూమి కర్మభూమి, తత్త్వభూమి, మోక్షభూమి అని పేరు పొందింది. ఇదే భావం, పోతనగారి యీ పద్యంలో తెలుస్తుంది.
No comments:
Post a Comment