అలబల మంది యందుల మృగావలియున్ విహగంబులున్ భయా
కులగతి బొంది మూగలును గుంటులు జీకులునైన యట్టులై,
యులియక, యున్నచో నడగియుండగ, గిరాతబలంబుతోడ బిం
గలనయనుం డుమేశ్వరుడు గవ్వడి డాయగ వచ్చె జెచ్చెరన్.
అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద పరమేశ్వరుని గూర్చి తపస్సు చేస్తున్నాడు. అర్జునుడిని పరీక్షించడానికి కిరాతవేషంలో శివుడు, బోయసాని రూపంలో అమ్మవారు, అడవిలో వేటకు బయలుదేరారు. ఆ
సంరంభం చూసి, అడవిలోని జంతువులు, పక్షులు, మూగలుగాను, కుంటివిగాను, గ్రుడ్డివిగాను అయిపోయినాయి. అంటే, ఎక్కడివక్కడే కదలకుండా భయంతో మొద్దుబారిపోయినాయి. ఆ విధంగా ఎఱుకల సమూహంతో అగ్ని నేత్రంగా కల శివుడు, సవ్యసాచియైన అర్జునుడిని సమీపించాడు.
ఈ పద్యంలో శివుని పరంగా ' పింగలనయనుండు ' అని, అర్జునుడి పరంగా ' కవ్వడి ' అని నన్నయగారు పదాలను సాభిప్రాయంగా వాడారు. శివుడు త్రినేత్రుడు. అందులో ఒకటి అగ్ని నేత్రం. అగ్ని నేత్రంతో చూడటమంటే కాల్చడమే. దీనినే, విశ్వనాథవారు శ్రీమద్రామాయణ కల్పవృక్షము సుందరకాండములో " ముఖంలో అగ్నినేత్రం కలవానిని, చూసి రమ్మంటే, కాల్చి రమ్మనే అర్థం కదా! " అని శైవాంశ సంభూతుడైన హనుమంతుని గురించి చమత్కరించారు. అగ్ని ఎదురుగా ఉన్న దానినల్లా దహించివేస్తుంది.
ఇక కవ్వడి అంటే, కవ+వడి. జంట వడులు కలవాడు. రెండు చేతులతోను వడిగా బాణప్రయోగం చేసేవాడు, సవ్యసాచి. బాణప్రయోగంలో, బాణానికి, బాణానికి మధ్య ఎడం ఉండదు.
పైన వాడబడిన రెండు విశేషణాలు స్వారస్యంతో కూడుకొన్నవి. ప్రతిస్పర్థు లిద్దరూ దీటైనవారు. ఇక వారిద్దరి మధ్యలో పోరు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించవచ్చు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వము, ప్రథమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment